కార్పొరేషన్/తెలంగాణచౌక్/కరీంనగర్ రూరల్/వీణవంక/మానకొండూర్రూరల్/శంకరపట్నం/చిగురుమామిడి, మే 1 : ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వేడుకలను జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. నగరంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు బొంకూరి రాములు ఆధ్వర్యంలో, ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో, హమాలీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ హాజరై గులాబీ జెండాను ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో కార్మికుల శ్రమ ఎనలేనిదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల కోసం ఎన్నో సంక్షేమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
నగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కళాభారతి నుంచి తెలంగాణ చౌక్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల హకుల సాధన కోసం నిరంతర పోరాటాలు కొనసాగిస్తామన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆ పార్టీ చీఫ్ జోన్ ఇన్చార్జి నిషాని రామచంద్రం మాట్లాడుతూ, ప్రభుత్వాలు కార్మికుల హకులను కాపాడాలని డిమాండ్ చేశారు. నగరంలోని బస్టాండ్ ఆవరణలో గల డిపో 1లో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో డిపో 1 జేఏసీ చైర్మన్ మనోహర్ మాట్లాడుతూ, ఎనిమిది గంటల పని విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కోతి రాంపూర్‌లోని సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రా భవన్ ఎదుట పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి మిలూరి వాసుదేవరెడ్డి ఆవిషరించారు. నాలుగు లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు కార్మికులు ఐక్యంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలను కొనసాగించాలన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో మే డే జెండాను సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. వీణవంక మండలం ఎలుబాకలో సీఐటీయూ, హమాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పిల్లి రవియాదవ్ జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బండి ఐలయ్య, మాడ రమణారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, జగ్గయ్యపల్లి, అన్నారం, కొండపల్కల, చెంజర్ల పలు గ్రామాల్లో కార్మిక సంఘాల జెండాలను కార్మిక వర్గాల నాయకులు ఆవిష్కరించారు.

కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి సంపత్, సీపీఎం మండల కార్యదర్శి భద్రయ్య, హమాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. శంకరపట్నం మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సీపీఎం, సీపీఐ పార్టీలతో పాటు అనుబంధ సంస్థలు ఏఐసీటీయూ, సీఐటీయూ, హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు మే డే పతాకాలను ఆవిష్కరించారు. వామపక్షాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు. చిగురుమామిడి, మండలం ఇందుర్తి, ఒగులాపూర్, రేకొండ, చిగురుమామిడి, ములనూర్, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, రామంచ, కొండాపూర్ తదితర గ్రామాల్లో కార్మికులు మేడే వేడుకలు జరుపుకొన్నారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందే స్వామి, బోయిని అశోక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతల శ్రీనివాస్ రెడ్డి, రైతు సంఘం మండలాధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి, సీపీఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు చాడ శ్రీధర్ రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.