రాజన్న సిరిసిల్ల, మే 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని వర్గాలను హామీల పేరిట మోసం చేసిందని, ఈ దరిద్రం ఇంకో రెండేళ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మనకు మళ్లీ మంచి రోజులు వస్తాయని, మరో ఏడాదిన్నర ఓపిక పట్టాలని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే బీఆర్ఎస్లో కొత్త కమిటీలు వేస్తామని, కాంగ్రెస్, బీజేపీతో యుద్ధం చేసేటోళ్లకు, కమిట్మెంట్తో పనిచేసేటోళ్లకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి కల్యాణోత్సవం, ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లె, నారాయణపూర్, పెద్దమ్మ తల్లి ఆలయం, శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్థిర ప్రతిష్ట మహోత్సవం, వీర్నపల్లి మండలం భూక్యా తండా, బావుసింగ్ నాయక్ తండాల్లో జగదాంబదేవి, సేవాలాల్ మహారాజ్ విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వీర్నపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, రైతులతో సమావేశమై, కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ దరిద్రాన్ని దేశమంతా వదిలించుకుంటే.. తెలంగాణలో మాత్రం దారినపోయే దాన్ని నెత్తిన రుద్దుకున్నారని విమర్శించారు. రెండున్నరేళ్ల పాలనలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఆగమయ్యారని ఆవేదన చెందారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలతో అన్ని వర్గాలను దగా చేశారని, ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా మళ్లీ ‘కేసీఆర్ రావాలి’ అని కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయేది మన ప్రభుత్వమేనని చెప్పారు.
ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే ఇగో అరెస్ట్… అగో అరెస్ట్ అంటున్నారని, కేటీఆర్‌ను జైళ్లో పెడతారంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తామేం తప్పుచేశామని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. మన ప్రభుత్వం లేకున్నా.. గ్రామాలకు ఏ అవసరమున్నా ‘నేను అండగా ఉంటా’నని భరోసా ఇచ్చారు. జూన్, జూలై నెలల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు చేస్తామని, కొత్త కమిటీలు వేస్తామని చెప్పారు. యుద్ధానికి సిద్ధమయ్యేటోళ్లే తనకు కావాలని, కాంగ్రెస్ బెదిరింపులు, కేసులకు బీఆర్ఎస్ నాయకులు భయపడవద్దని సూచించారు.
సమస్యలపై పోరాడిన వారికి, ‘ఢీ అంటే ఢీ’ అని కొట్లాడిన వారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు నిలదీద్దామని, రాబోయే పరిషత్ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి సిరిసిల్ల మున్సిపాలిటీ గెలిచినట్టు మొత్తం స్థానాలు మనమే గెలుద్దామని పిలుపునిచ్చారు. గతంలో మాదిరిగా వీర్నపల్లి మండలం వ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్‌లో ఎల్వీ ప్రసాద్, సబేరీ హాస్పిటల్ యజమాన్యంతో మాట్లాడానని, త్వరలోనే కంటి పరీక్షలు చేయిస్తామని అన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు, ఆపరేషన్లు అందేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, మాడుగుల మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, గుజ్జుల రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాలరాజుగౌడ్, మాజీ మండల అధ్యక్షుడు ఎడ్ల సాగర్, మాజీ ఎంపీపీలు ఎలుసాని సుజాత – మోహన్, మాలోతు బూల, మాజీ జడ్పీ కో ఆప్షన్ చాంద్‌పాషా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు అందె సుభాష్, నర్సింహారెడ్డి, దయాకర్‌రావు, లక్ష్మణ్, రాజిరెడ్డి, పిల్లి కిషన్, తదితరులు ఉన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సందెట్లా సడేమియాలాగా మారిండు. ఎంతసేపూ మతం పేరిట జనాల నెత్తి కరాబు చేస్తున్నడు. రైతుల గురించి, కరెంట్ గురించి, కోనుగోళ్ల గురించి కనీస అవగాహన కూడా లేదు. రైతు బతికిండా.. సచ్చిండా… అని కూడా కనీసం పట్టించుకోడు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఏనాడూ ప్రశ్నించడు. ఆయన కేంద్రమంత్రి అయిన రెండున్నరేళ్లలో దత్తత గ్రామమైన వీర్నపల్లిలో ఒక బడి కట్టలేదు.. ఒక గుడి కూడా కట్టలేదు. చదువు రాదు.. శాస్త్రం రాదు. మతం పేరిట ఓట్లు వేయించుకోవడం తప్ప చేసిందేమీ లేదు. మనకు బొట్టు పెట్టుకోవడం, దేవుడికి మొక్కడం బీజేపీ నేర్పిందా? వీళ్లు రాకముందు మనకు గుడులు, దేవుళ్లు లేరా? బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వ సొమ్ముతో బ్రహ్మాండంగా యాదాద్రి కట్టిండు. దేశంలో బీజేపీ వాళ్లు ఎక్కడైనా గుడి కట్టారా? రామమందిరం కూడా ప్రజల చందాలతో నిర్మించినదే.
– కేటీఆర్