రూ.5కోట్లతో నిర్మాణం
నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
కార్పొరేషన్, మార్చి 16: ఆధునిక హంగులు.. సకల వసతులతో కరీంనగర్లో బీసీ స్టడీ సర్కిల్ సిద్ధమైంది. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న పేద యువత కోసం నగరంలోని ఉజ్వల పార్కు సమీపంలో రూ.5కోట్లతో మూడంతస్తుల భవంతి నిర్మించగా, నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకాబోతున్నది. కాగా, ఈ చదువుల కేంద్రలో ఒకే సారి 500 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 200 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ యువతకు వసతి సదుపాయాలతో పాటు లైబ్రరీ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, బీసీ విద్యార్థుల కోసం చేపట్టిన ఈ స్టడీ సర్కిల్ విషయంలో స్థల కేటాయింపు నుంచి భవన నిర్మాణం పూర్తయ్యేదాకా మంత్రి గంగుల ప్రత్యేక చొరవ తీసుకోడంతోనే సకాలంలో ప్రారంభానికి రెడీ అయింది.
సకల వసతులు..
మూడంతస్తుల భవనంలో సకల సౌకర్యాలు సమకూర్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో విద్యార్థులకు మంచి హైజెనిక్ వాతావరణంలో కిచెన్, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో కూడిన లైబ్రరీ, రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో అత్యాధునిక పద్ధతిలో 3 డిజిటల్ తరగతి గదులు, స్టాప్ రూం, డైరెక్టర్ గది, కంప్యూటర్ ల్యాబ్, 200 మంది సెమినార్ నిర్వహించుకునేందుకు వీలుగా మీటింగ్ హాల్ నిర్మించారు. రెండో అంతస్తులో వెంటిలేషన్ సౌకర్యం, వార్డ్ రోబ్, రీడింగ్ టేబుళ్లతో కూడిన విశాలమైన వసతి గదుల్ని ఏర్పాటు చేయగా, గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
బీసీలకు మంచి శిక్షణ అందిస్తాం
నూతనంగా ఏర్పాటు చేస్తున్న బీసీ స్టడీ సర్కిల్ భవనంలో ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పటికే మంకమ్మతోటలో నడుస్తున్న బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వేలాది మంది అభ్యర్థులు పోటీ పరీక్షల్లో తమ ప్రతిభ చూపి ఉద్యోగ అవకాశాలు పొందారు. నూతన భవనంలో మరిన్ని సౌకర్యాలు కల్పించి మంచి శిక్షణ అందిస్తాం. బ్యాంకింగ్, టెలికాం సంస్థలతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కలల్ని నెరవేర్చి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే ప్రభుత్వ ఆశయం. ఆ దిశగా మేం పని చేస్తున్నాం.
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి