కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ రూరల్: “మా నాన్న కేసీఆర్ వద్దని చెప్పి ఉండకపోతే నేను కూడా డాక్టర్ అయ్యేవాడిని” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తాను డాక్టర్ కావాలనే కోరిక తన అమ్మలో బలంగా ఉండేదని తెలిపారు. శనివారం చల్మెడ ఆనంద రావు మెడికల్ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, చల్మెడ మెడికల్ కళాశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “ప్రతి విద్యార్థికి 8,9వ తరగతుల్లో భవిష్యత్తులో ఏం అవ్వాలనే కోరికలను తల్లిదండ్రులే రగిలిస్తారు. నేను డాక్టర్ కావాలని మా అమ్మ బలంగా కోరుకునేది.
నేను ఇంటర్ చదివే రోజుల్లో ఇన్ని మెడికల్ కళాశాలలు అందుబాటులో లేవు. మా అమ్మ కోరిక మేరకు కర్నాటకలో అప్పట్లో ఉన్న కేసెట్ రాస్తే, ఫ్రీ సీట్ వచ్చింది. అందుకు మా అమ్మ ఎంతో సంతోష పడ్డారు. అయితే, మా నాన్న మాత్రం మెడిసిన్ చదివితే ఎలా ఉంటుందో చెప్పారు. ఆయన మాటలు విని డిగ్రీలో జాయిన్ అయ్యా” అని గుర్తు చేసుకున్నారు. మెడిసిన్ అనేది పేషెన్సీతో చదవాల్సి ఉంటుందని, ఏడెనిమిదేళ్లు ఎంతో ఓపికగా చదివిన వైద్య విద్యార్థులకు అభినందనలు చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు పెద్ద సవాల్ ఎదురవబోతున్నదని చెప్పారు.
చాట్ జీపీటీ, గ్రోక్‌లు ప్రిస్కిప్షన్లు కూడా రాస్తున్నాయని, ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల వద్దకు వస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నారు. కరుణ, దయ, సానుభూతితో రోగులకు వైద్యులు సేవలు అందించాలని కోరారు. వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో వైద్యులందరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ 2019లో తన కూతురు జాహ్నవితో కలిసి హైదరాబాద్‌కు కౌన్సెలింగ్ వెళ్లానని, అక్కడ చల్మెడ మెడికల్ కళాశాల గురించి గొప్పగా మాట్లాడుకోవడం విని తన కూతురు కోసం ఈ కళాశాలను ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోనే చల్మెడ మెడికల్ కళాశాలకు మంచి పేరున్నదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో మెడికల్ విద్యా అవకాశాలు మెరుగుపడ్డాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులు ఒక విజన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. తల్లి దండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, వారితో పాటు గురువులు కూడా ఎంతో ఓపికగా విద్యను అందిస్తారని, వీరిని ఎప్పటికీ మర్చి పోవద్దని సూచించారు.
ఈ స్నాతకోత్సవ సభలో ఇంకా చల్మెడ లక్ష్మీనరసింహారావు తదితరులు మాట్లాడారు. సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కూడా ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక్కడ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ వీ సూర్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆసిం అలీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీ అనిత పాల్గొన్నారు.