KTR | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 19 : వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా కేటీఆర్ పాడే మోశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ ‘జై తెలంగాణ’ అని నినదించడమే కాకుండా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ధీరవనిత అని ఆమెకు పేరుంది.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకుస్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహ రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.