రాజన్న సిరిసిల్ల, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలని అర్బన్ బ్యాంక్ పాలకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్దేశం చేశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు బుధవారం బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను కేటీఆర్ సన్మానించి, అభినందించారు. అనంతరం మాట్లాడుతూ, సిరిసిల్ల ప్రాంత ప్రజలకు సేవలందించడంలో బ్యాంక్ మంచిపేరు తెచ్చుకున్నదని, ఆ పేరును చిరస్థాయిగా కొనసాగించాలని సూచించారు. పార్టీపై నమ్మకం, తమపై ఉన్న అభిమానంతో మూడు సార్లు పార్టీ అభ్యర్థులను గెలిపించి.. బ్యాంక్‌పై గులాబీ జెండా ఎగిరేలా చేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
శాసనసభ్యుడిగా తాను బ్యాంక్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళీ, సభ్యులు సంజీవ్, సుక్కవ్వ, కుమార్రాజు, దేవదాస్, హర్షిణి, సత్యానందం, రాజు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, అగ్గిరాములు, తదితరులు పాల్గొన్నారు.