ఎల్లారెడ్డిపేట, జనవరి 4: జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉన్నారని, ప్రమాద బీమాతో భరోసానిచ్చారని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్హాల్లో 450, వీర్నపల్లిలో 60 మంది ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అందించిన ప్రమాద, ఆరోగ్య బీమా కార్డులను పంపిణీ చేశారు. ఆటో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్‌తో కలిసి మాట్లాడారు.
కాంగ్రెస్, టీడీపీ హయాంలో షాక్‌తో ఎవరైనా చనిపోతే వారికి అరకొర డబ్బులు ఇచ్చేవారని, అవి కూడా ఆయా పార్టీల కార్యకర్తలు కమీషన్ తీసుకుని పంపిణీ చేసేవారని గుర్తుచేశారు. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాద బీమాతో అండగా నిలిచారని, దురదృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు 5లక్షల బీమా అందించారని చెప్పారు. వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీశ్ ఆటో నడవక ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు ఆ కుటుంబానికి కేటీఆర్ అండగా నిలిచారన్నారు.
అప్పటి నుంచి ప్రతి ఆటో డ్రైవర్‌కు 5లక్షల ప్రమాద బీమా చేయించి భరోసాగా ఇచ్చారన్నారు. అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఆరోగ్య సమస్య తలెత్తితే ఉచితంగా తమ దవాఖానలో చికిత్స అందించేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆ పార్టీ నాయకులను ఆటో కార్మికులు నిలదీయాలని పిలుపునిచ్చారు.