హుజూరాబాద్, మార్చి 18: హుజూరాబాద్ నియోజకవర్గంలో సమస్యలు తాండవం చేస్తున్నాయని, వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా జమ్మికుంట, వీణవంక, ఇతర మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, బాధిత రైతులకు తక్షణ నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాలని కోరారు. బుధవారం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. వీణవంక మండల కేంద్రంలో రూ.30 కోట్లతో మంజూరైన ఆర్అండ్బీ రోడ్డు పనులు మూడేండ్లు గడిచినా పూర్తి కాలేదని మండిపడ్డారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ హయాంలో మంజూరైన ఈ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు.
అలాగే కోరల్ గ్రామం వద్ద ఆర్అండ్బీ రోడ్డు మధ్యలో అర కిలోమీటర్ పనులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పూర్తి చేయాలని కోరారు. వీటితో పాటు రాచపల్లి, నాగంపేట రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని, అత్యవసరంగా పునర్నిర్మించాలని సూచించారు. గత ప్రభుత్వంలో కల్వల ప్రాజెక్ట్ పునర్నిర్మాణానికి రూ.70 కోట్ల డీపీఆర్ సిద్ధమైందని గుర్తుచేస్తూ, ప్రాజెక్ట్‌కు వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు. కరీంనగర్ పోలీస్ వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు.
జిల్లా సీపీ గౌస్ ఆలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్‌కు కేటాయించిన ప్రభుత్వ ఇన్నోవా వాహనం (టీఎస్ 09 బీఏ 4195)ను హైదరాబాద్‌లో ప్రైవేట్ వ్యక్తులు వినియోగిస్తున్నారని, ఆ వాహనానికి అశోక్, అనిల్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు వ్యక్తిగత డ్రైవర్లుగా పనిచేస్తున్నారని వెల్లడించారు. అమీర్‌పేట్‌లోని ప్రైవేట్ అపార్ట్ మెంట్లలో విధులు నిర్వర్తిస్తూ, పోలీస్ రికార్డుల్లో మాత్రం కరీంనగర్లో డ్యూటీలో ఉన్నట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వాహనం డీజీపీ కార్యాలయం సమీపంలోని సువిధలో ప్రతిరోజూ పార్ చేస్తున్నట్లు వివరించారు.
ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలతో కాల్పులు జరిపిన ఘటననూ ప్రస్తావించారు. ఈ ఘటనలో అమృతమ్మ మహిళ గాయపడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కలెక్టర్, సీపీ ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించడం లేదని, ప్రజా సమస్యలు ఎలా పరిషరించాలనే ప్రశ్నను సభ ముందుంచారు. జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ ఈ విషయాలను సీరియస్‌గా తీసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలను ప్రభుత్వం వెంటనే నోట్ చేసుకుని చర్యలు చేపట్టేందుకు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.