మహారాష్ట్ర పర్యాటక రాజధానిగా పేరొందిన ఔరంగాబాద్… షిర్డీ నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని పాలనాకేంద్రంగా చేసుకొని దక్షిణాది వ్యవహారాలు చూసుకునేవాడు. అప్పటి నుంచి ఈ పట్టణం ఔరంగాబాద్‌గా పేరొందింది. ఇక్కడ చూడాల్సిన వాటిలో బీబీ కా మక్బరా ఒకటి. దక్కన్ తాజ్‌మహల్‌గా గుర్తింపు పొందిన ఈ కట్టడం.. ఔరంగజేబు భార్య రబియా దురానీ సమాధి. ఔరంగాబాద్ సమీపంలో శత్రుదుర్బేధ్యమైన దౌలతాబాద్ కోట (15 కి.మీ) సందర్శించాల్సిన మరో ప్రదేశం.
శతాబ్దాల నుంచి పట్టువస్ర్తాల తయారీలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఔరంగాబాద్‌లో అందమైన పట్టు చీరలు, నాణ్యమైన శాలువాలు లభిస్తాయి. ఔరంగాబాద్ సమీపంలో ప్రఖ్యాత అజంతా-ఎల్లోరా గుహలున్నాయి. అజంతా 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఈ గుహల్లోని అపురూప శిల్పాలు బౌద్ధమతానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. గుర్రపునాడా ఆకారంలో ఉన్న గుట్టల్లో ఏకంగా 29 గుహలు ఉండటం విశేషం.
ఔరంగాబాద్ నుంచి ఎల్లోరా 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్రీస్తుశకం 5-10 శతాబ్దాల మధ్య నిర్మించిన ఈ గుహల్లో హిందు, బౌద్ధ, జైన మతాల ఆనవాళ్లు ఉన్నాయి. విభిన్న మతాల వైభవం ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడి కైలాస దేవాలయం ఆనాటి కళాకారుల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. కొండను తొలిచి అందులో ఆలయాన్ని నిర్మించిన తీరు అబ్బురపరుస్తుంది. ఇక ఔరంగాబాద్‌కు దగ్గర్లో ఉన్న శైవక్షేత్రం (58 కి.మీ) ఘృష్ణేశ్వర్. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృష్ణేశ్వరుడి దర్శించేందుకు ఏడాది పొడుగునా భక్తులు తరలి వెళ్తుంటారు. ఢిల్లీ సుల్తానుల దాడిలో ధ్వంసమైన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో పునరుద్ధరించారు.