Municipal Budget | కోరుట్ల, ఏప్రిల్ 23: కోరుట్ల పట్టణ ప్రగతి లక్ష్యంగా అధికారులు బుధవారం లెక్కల పద్దులు తయారు చేశారు. ప్రత్యేకాధికారి పాలనలో కలెక్టర్ సారథ్యంలో బడ్జెట్ ను రూపొందించారు. 2025 – 26 సంవత్సరానికి మున్సిపల్ బడ్జెట్ రూ.39 కోట్ల 85 లక్షల 32 వేలుగా నిర్ణయించి ఆమోదం తెలిపారు. తెలంగాణ పురపాలక సంఘం, మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 107 అనుసరించి జారీ చేయబడిన రూల్స్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరమునకు వార్షిక చిత్తు బడ్జెట్ అంచనా, ఆదాయ, వ్యయాలను అమోదించినట్లు మున్సిపల్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మొత్తం రూ.39 కోట్ల 85 లక్షల 32 వేలు కాగా, 2025-26 ఆర్ధిక సంవత్సరం క్యాపిటల్ గ్రాంట్స్ రూ.25 కోట్ల 76 లక్షల 46 వేలు, జనరల్ ఫండ్ ఆదాయం రూ.14 కోట్ల 8 లక్షల 86 వేలు, చార్జ్ వ్యయం రూ.11 కోట్ల 19 లక్షల 29 వేలుగా ఉంటుందని అంచనా వేశారు. ఇందులో జీత భత్యాల కోసం రూ. 5.40 కోట్లు, పారిశుధ్య నిర్వహణ ఖర్చుల కోసం రూ.1 కోటి 53 లక్షల 90 వేలు, విద్యుత్ చార్జీల చెల్లింపునకు రూ.2 కోట్ల 7 లక్షల 60 వేలు, ఋణాల చెల్లింపునకు రూ.80 లక్షలు, హరితహరం మొక్కల సంరక్షణకు రూ.కోటి 37 లక్షల 79 వేలు, నిర్వహణ వ్యయం రూ.కోటి 58 లక్షల 7 వేలు కేటాయించారు.
మున్సిపల్ మిగులు బడ్జెట్ రూ.1.50 కోట్లుగా నిర్ధారించారు. మిగులు బడ్జెట్ లో 1/3వ వంతు మౌలిక వసతుల కల్పన, విలీన ప్రాంతాల అభివృద్ధి, అభివృద్ధి చెందని ప్రాంతాలు, బలహీన వర్గాల ప్రాంతాలు, మైనారిటీ ప్రాంతాలలో, మురుకివాడల అభివృద్ధి కోసం రూ.33.50 లక్షలు, ప్రజా సౌకర్యాలు, వివిధ వార్డులకు జనరల్ ఫండ్ నుంచి కేటాయింపులు రూ.67 లక్షలు, అభివృద్ధి కార్యక్రమాలకు గ్రాంట్స్ నిధుల నుంచి రూ. 25 కోట్ల 76 లక్షల 46 వేలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.