కోరుట్ల రూరల్, ఏప్రిల్ 15: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కదిలిరావాలని, సభను సక్సెస్ చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. మంగళవారం కోరుట్ల పట్టణంలోని దేశాయి బీడీ కార్కానాలో బీడీ కార్మికులు, టేకేదారులు, ప్యాకింగ్ కార్మికులతో పలు కుల సంఘాలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశంలో బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. రైతులకు రైతు బీమా, రైతుబంధు సకాలంలో అందివ్వడమే కాకుండా పంటలు పండించుకునేందుకు ప్రతి ఎకరానికి నీరు, నిరంతర విద్యుత్‌ను ఇచ్చిన కేసీఆర్‌ను రైతులు మరవలేకపోతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ను ఆశీర్వదించడానికి మహాసభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆయన వెంట రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, నాయకులు పిడుగు సందయ్య, ఏనుగందుల సత్యనారాయణ, బాబురావు, ఎండీ అమీర్, బొమ్మ రాజేశం, నాయకులు, తదితరులు ఉన్నారు.
హుజూరాబాద్, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరగాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సాయం త్రం హుజూరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివస్తారని, అన్ని నియోజకవర్గాల కంటే హుజూరాబాద్ నుంచి అత్యధికంగా ప్రజలు హాజరు కావాలని కోరా రు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ, 16 నెలలు గడిచినా ఇప్పటివరకు ఒకటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. హామీలపై నిలదీస్తే తనపై కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ బంద్ పెట్టిందని, కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల కరెంట్ విషయంలో పూర్తిగా అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గందె రాధికా శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, అపరాధ ముత్యంరాజు, ములుగు సృజనాపూర్ణ చందర్, కిషన్, కల్లపల్లి రమాదేవి, కేసీరెడ్డి లావణ్య, ఆరే రమేశ్, కోయడ కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.
యైటింక్లయిన్ కాలనీ, ఏప్రిల్ 15 : త్యాగాల పునాదులపై పుట్టిందే గులాబీ పార్టీ అని, అక్రమ కేసులకు అదిరేది లేదని, బెదిరేది లేదని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమించి లాఠీ దెబ్బలు తిని జైలుకు కూడా వెళ్లిన గుండెలు తమవని, ఇప్పుడు ఉద్యమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎలా వెనుకడుగు వేస్తామని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరి పేర్లు రాసి పెట్టుకుంటున్నామని, ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రజతోత్సవ సభలో కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు లెక్కబెట్టుకోక తప్పదని స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఆరంభమవుతుందని విమర్శించారు. మంగళవారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల శ్వాసగా త్యాగాల పునాధులపై పుట్టిన గులాబీ పార్టీ జెండాను ఇప్పుడు అదే నాలుగు కోట్ల మంది ఎత్తుకునేందుకు సిద్ధమవుతున్నారని, రాష్ర్టానికి మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అబద్ధపు హామీలు, ఆరు గ్యారెంటీలను నమ్మినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రజలు ఇప్పటికే గుర్తించారని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయకపోగా, రైతు భరోసా కూడా ఇవ్వకుండా నట్టేట ముంచిందన్నారు. లక్ష ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కుట్ర పూరితంగా బంద్ చేయించి తెలంగాణను మళ్లీ ఎడారిగా మారుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు మేడి సదానందం, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు చెరుకు ప్రభాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ బాదె అంజలీ దేవి, ముద్దసాని సంధ్యారెడ్డి, నాయకులు గుడెల్లి రాంచందర్, దాసరి బాలరాజు, కుమార్ నాయక్, తీగల సుజాత, ఓరుగంటి శంకర్, మారుతి పాల్గొన్నారు.
మానకొండూర్, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు తరలి వచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపు నిచ్చారు. మంగళవారం మానకొండూర్ మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంతోపాటు శంకరపట్నం మండలం వంకాయగూడెం మాధవసాయి గార్డెన్లో వేర్వేరుగా ‘చలో వరంగల్ రజతోత్సవ బహిరంగ సభ’ పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రాంతీయ పార్టీగా బీఅర్ఎస్కు ప్రజల్లో విశేష ఆదరణ ఉందన్నారు. రజతోత్సవ సభ అంటే బీఆర్ఎస్ పార్టీ కుంభమేళాగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 10 వేలకు పైగా మంది తరలి వస్తారని తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా ఎక్కువ మందిని బస్సుల్లో తరలించడానికే అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గ్రామాల్లో పార్టీ జెండా ఎగురవేసి బహిరంగ సభకు రావాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మానకొండూర్ మండలాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, శంకరపట్నం మండలాధ్యక్షుడు గంట మహిపాల్, మాజీ జడ్పీటీసీలు పొద్దుటూరి సంజీవరెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజక కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, నాయకులు రామంచ గోపాల్‌రెడ్డి, రెడ్డి సంపత్‌రెడ్డి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, గోపు ఈశ్వర్‌రెడ్డి, నామాల శ్రీనివాస్, నెల్లి మురళి, బోడ రాజశేఖర్, ఇస్కుల్ల అంజయ్య, నెల్లి శంకర్, పిండి సందీప్ పాల్గొన్నారు.