మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 8 : తెలంగాణ జాతిపిత కేసీఆరేనని, ఆయన పేరెత్తే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల హితవుపలికారు. అమలు కాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అదివారం మెట్పల్లి పట్టణంలోని 9వ వార్డు రాంనగర్, 20వ వార్డు ఆదర్శనగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొని ప్రసంగించారు. పెద్దాపూర్ క్యాంపు పాఠశాలలో పాము కాటుతో ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే తానే స్వయంగా వెళ్లి మిగిలిన విద్యార్థులకు వైద్యుడిగా చికిత్స అందించానని గుర్తు చేశారు.
ఈ అసమర్థ పాలన ను ప్రజలు తిరస్కరించాలని కోరారు. కాంగ్రెసోళ్లు ఓట్లు అడగడానికి వస్తే మహిళలకు బాకీ ఉన్న 65 వేలు, పెన్షన్ దారులకు బాకీ ఉన్న 52 వేలు చెల్లిస్తే మీకే ఓటు వేస్తామని ఖరాకండిగా చెప్పాలని సూచించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలు, మెట్పల్లిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లలో పట్టణానికి ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. మెట్పల్లి అభివృద్ధి కోసం మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశాల్లో 9,20 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు మొరపు లక్ష్మిగంగాధర్, ఉజగిరి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.