మెట్పల్లి/కోరుట్ల, మార్చి 18: కోరుట్ల, మెట్పల్లి ప్రభుత్వ దవాఖానల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన కోరుట్ల నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ప్రస్తావించారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో గత రెండున్నరేళ్లుగా ప్రాథమిక వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందని సభ దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. దవాఖానల్లో ఈఎన్టీ సర్జన్, జనరల్ సర్జన్ అందుబాటులో ఉన్నప్పటికీ అవసరమైన వైద్య పరికరాలు లేకపోవడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదని తెలిపారు. వెంటనే అవసరమైన పరికరాలను సమకూర్చాలని కోరారు.
మెట్పల్లి ప్రభుత్వ దవాఖాన పాత భవనం అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉండి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. దవాఖాన కొత్త భవన నిర్మాణం 90శాతం పూర్తయిందని, మిగిలిన చిన్నపాటి పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. దవాఖాన దుస్థితిపై పూర్తి వివరాలతో నివేదిక తీసుకుని వెంటనే మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.