మెట్పల్లి రూరల్, నవంబర్ 17 : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇంకెప్పుడు ఇస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని మండిపడ్డారు. సోమవారం మెట్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మెట్పల్లి మండలం, పట్టణానికి చెందిన 66 మందికి 66,07,656 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే, 30 మందికి 6.98 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఆగ్రహించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి భారం కాకూడదన్న సదుద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, ఆర్ఐ ఉమేశ్, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.