జగిత్యాల, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేను కోరుట్లలో రాజీనామా చేసి జగిత్యాల నుంచి పోటీ చేస్తా’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్ పంచన చేరిన ఆయన, జగిత్యాల ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్టీ పిరాయింపుల మీద స్పీకర్ సమక్షంలో బీఆర్ఎస్లోనే ఉన్నానని, కాంగ్రెస్‌లో చేరలేదని చెప్పి.. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పాత్రికేయుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని, అందులో భాగంగానే జగిత్యాల మెడికల్ కాలేజీని ఇటీవల పరిశీలించానని చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను మీడియాలో ప్రస్తావించి, పరిష్కరించాలని కోరానన్నారు. దీనికే ఉలిక్కిపడిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి, ఇష్టారాజ్యంగా మాట్లాడడం, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవుపలికారు.
ప్రతి జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ, నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ, మండలానికి జూనియర్ కాలేజీ, మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నియోజకవర్గానికి వంద పడకల దవాఖాన ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగారని గుర్తు చేశారు. అందులో భాగంగానే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చారని, జగిత్యాల జిల్లాకు కూడా కేటాయించారని చెప్పారు. నిబంధనల ప్రకారం నేషనల్ మెడికల్ కౌన్సిల్ కాలేజీ వసతులను చూసి కాలేజీ నిర్వహణకు సమ్మతించిందన్నారు. కానీ, మెడికల్ కాలేజీని అప్పటి సీఎం కేసీఆర్‌కు చెప్పి మంజూరు చేయించానని, తన వల్లే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు మంజూరు చేసిందని జగిత్యాల ఎమ్మెల్యే చెప్పుకోవడం అర్థరహితమన్నారు. అందులో ఆయన గొప్పతనం ఏమీ లేదని విమర్శించారు. కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాలకు చెందిన రోగులు వైద్యం కోసం జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు వస్తున్నారని, అలా రాకుండా చూసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం అనేది జిల్లా ప్రజలందరికీ సంబంధించిందని, అదేమైనా ఆయన సొంత ఆస్తా..? అని మండిపడ్డారు.
జగిత్యాల ఎమ్మెల్యే తన నడుం నొప్పి, మెడ నొప్పుల వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నారని, జగిత్యాలలో వైద్యం చేసుకోకుండా, హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావని తామేమైనా ప్రశ్నిస్తున్నామా..? అని అన్నారు. ఆయనకు ఆత్మవిశ్వాసం తకువ.. అభద్రతభావం, ఆత్మన్యూనత ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని దవాఖానల నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయ్యిందని, రెండేండ్ల క్రితమే వాటిని అప్పటి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా మెట్పల్లి దవాఖాన భవనానికి, కోరుట్ల వంద పడకల దవాఖానకు స్టాఫ్ ప్యాట్రన్‌ను మంజూరు చేయడం లేదన్నారు. రెండేండ్లుగా అవకాశం లభించిన ప్రతీసారి అసెంబ్లీలో కోరుట్ల, మెట్పల్లి దవాఖానల సమస్యలను ప్రస్తావించానని గుర్తు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే ఏనాడైనా జగిత్యాల ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, తన తండ్రి విద్యాసాగర్‌రావును కాంట్రాక్టర్ అని వ్యాఖ్యానించడం సరికాదని సూచించారు.
తన తండ్రి ఎమ్మెల్యే కాకముందే స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ అని, ఎమ్మెల్యే అయ్యాక కాంట్రాక్ట్ పనులు మానివేస్తే.. డాక్టర్ సంజయ్‌కుమార్ మాత్రం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక బినామీ కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడన్న విమర్శలున్నాయన్నారు. జగిత్యాల పట్టణంతోపాటు, నియోజకవర్గంలోని అనేక కాంట్రాక్టు పనులను ఆయన తన బంధువుకు చెందిన ఒక సంస్థకు మాత్రమే కట్టబెట్టి, చిన్న కాంట్రాక్టర్ల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బినామీ సంస్థ వల్ల తమకు జరుగుతున్న అన్యాయం గురించి కాంట్రాక్టర్లు స్వయంగా ఫోన్లు చేసి చెబుతున్నారని తెలిపారు. పెన్షన్ పెంపు, రుణమాఫీ, యాసంగి, వానకాలం సన్న వడ్ల బోనస్ కోసం సీఎం దగ్గరకు వెళ్దామని సూచించారు. వీటిని సాధించేందుకు జగిత్యాల ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని హితవుపలికారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు పెట్టుబడులు లేక, రానున్న యాసంగి పంటలు వేసే విషయంలో మిన్నకుండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మక్కల డబ్బులు, రైతు భరోసా, సన్నాల బోనస్ డబ్బులను ప్రభుత్వం అందజేస్తే, రైతులు యాసంగి పంటలు సాగు చేస్తారని తెలిపారు. ఈ సమస్యలపై జగిత్యాల ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మారు సాయిరెడ్డి, దారిశెట్టి రాజేశ్, దశరథ్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఫహీం, భాసర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.