మెట్పల్లి రూరల్, మే 6: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం వెల్లుల్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కేంద్రంలో తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి, అదనపు కలెక్టర్ లత, డీసీవో మనోజ్‌తో ఫోన్లో మాట్లాడి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
గన్నీ బ్యాగులు, హమాలీల కొరత ఉందని రైతులు చెబుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. కేవలం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే హమాలీలే కాకుండా స్థానిక హమాలీలతోనూ పనులు చేయించాలని చెప్పారు. కొనుగోళ్లలో జాప్యం జరిగితే అకాల వర్షాలతో రైతులకు మరింత నష్టం జరుగుతుందని, కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.