MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, నవంబర్ 24: అందరూ ఉండి అనాధల మారిన ఓ వృద్ధురాలి దీనస్థితినీ చూసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చలించిపోయారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తిరుగు ప్రయాణంలో పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఆరు బయట మెట్లపై బట్టల సామగ్రి తో ఉన్న వృద్ధురాలిని ఆయన గమనించారు.
వృద్ధురాలి గురించి వివరాలు అడిగారు.. తనది కథలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామం పేరు పెండెం శారద అని, తనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని చెప్పింది. భర్త గంగారం కాలం చేశాడని, పిల్లలు అందరూ ఉన్నత స్థితిలోనే ఉన్నారని, వృద్ధాప్యంలో అనాథగా వదిలేశారని వాపోయింది.
ఉన్నంతలో ఇద్దరు కొడుకులు, కూతుళ్లకు ఘనంగా పెళ్లి చేశానని, నివసించడానికి ఇల్లు కూడా లేదని వివరించింది. తనకు గ్రామంలో ఎవరు ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదని అందుకే కోరుట్లకు వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపింది. ఎవరైనా బుక్కడంతా కూడు పెడితే కడుపు నింపుకుంటున్నానని, దొరకన్నాడు పస్తులు ఉండాల్సి వస్తుందని రోధించింది. వృద్ధురాలి పరిస్థితిని వెంటనే కోరుట్ల ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఆమెకు న్యాయం చేయాలని, అవసరమైతే షెల్టర్ హోమ్ కు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.