MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, జూన్ 16: పట్టణంలోని మెట్పల్లి రోడ్డు జాతీయ రహదారి పక్కన గల బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం సమీపంలో భారీ విగ్రహాన్ని మరోచోటికి తరలిస్తున్న క్రమంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పరామర్శించారు.
హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే అండగా ఉంటానని భరోసానిచ్చారు. విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విద్యుత్ ప్రమాదం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.