Korutla | కోరుట్ల సరికొత్తగా కనిపిస్తున్నది. ప్రగతిలో కళకళలాడుతున్నది. జంట పట్టణాలకు నిలయమైన ఈ నియోజకవర్గం, ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిపోయింది. నాటి ప్రభుత్వాల పట్టింపులేక, కనీస వసతుల్లేక అవస్థలు పడింది. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చొరవతో తొమ్మిదిన్నరేండ్లలోనే వందల కోట్ల నిధులతో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుకొని తన రూపురేఖలు మార్చుకున్నది. అభివృద్ధిలోనే కాదు సంక్షేమంలోనూ దూసుకెళ్తున్నది. విద్య, వైద్యం సహా అన్నిరంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించి పేదలకు స్వాంతన కలిగిస్తున్నది.
జగిత్యాల, నవంబర్ 2(నమస్తే తెలంగాణ):అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గం, స్వరాష్ట్రంలో దూసుకెళ్లింది. గడిచిన తొమ్మిదేండ్లలో ప్రగతి పరుగులు తీసింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కృషితో అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్నది.
గ్రామీణ రోడ్లకు మహర్దశ కలిగింది. ఒకప్పుడు కనీసం సింగిల్ రోడ్డుకే నోచుకోని అనేక పల్లెలకు నేడు డబుల్ (రెండు వరుసల) రోడ్లు వచ్చాయి. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో కోరుట్ల నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ నుంచి రహదారులు, హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం 232 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అందులో ఇప్పటి వరకు 162.80 కోట్ల నిధులతో చేపట్టిన 41 రహదారుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 52.30 కోట్లతో మరో 28 రోడ్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. అలాగే పంచాయతీ రాజ్ శాఖ నుంచి సుమారు 100 కోట్ల వ్యయంతో రహదారుల అభివృద్ధి, గ్రామాల మధ్య లింకు రోడ్లు ఏర్పడ్డాయి.
ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువైంది. నియోజకవర్గ కేంద్రమైన కోరుట్లలో 20 కోట్లతో 100 పడకల దవాఖాన నిర్మించారు. దీంతోపాటు బస్తీ దవాఖాన, డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. మెట్పల్లిలో 7.5 కోట్లతో 30 పడకల దవాఖాన సామర్థ్యాన్ని పెంచి ఆధునిక వసతులతో కూడిన నూతన భవనం నిర్మిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో 7.20 కోట్ల నిధులతో 36 ఆరోగ్య ఉపకేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణ కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
మిషన్ భగీరథ కింద ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా శివారులో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్‌ను నిర్మించి ఇక్కడి నుంచి జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలకు నీటి సరఫరా చేస్తున్నారు. 1300 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్పల్లి మండలాల్లోని 78 గ్రామ పంచాయతీల్లో కలిపి 71 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు. కొత్తగా 63,287 నల్లా కలెక్షన్లు అమర్చారు. నల్లాలకు నీరు ఇచ్చేందుకు 635.45 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ ఏర్పాటు చేశారు. కోరుట్ల పట్టణంలో 80 కోట్లు, మెట్పల్లి పట్టణంలో 70 కోట్ల వ్యయంతో ఓవర్‌హెడ్ ట్యాంకులు, పూర్తి చేశారు.
అభాగ్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఇస్తున్నది. దివ్యాంగులకు 3016, ఇతర పింఛన్‌దారులకు 2016 చొప్పున ప్రతి నెలా అందిస్తున్నది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో 17,358 మంది వృద్ధులు, 13,527 మంది వితంతువులు, 4,979 మంది దివ్యాంగులు, 1108 మంది గీతకార్మికులు, 378 మంది నేత కార్మికులు, 1461 మంది ఒంటరి మహిళలు, 31,756 మందికి బీడీ కార్మికులు (జీవన భృతి), 305 మంది బోధకాలు(పైలేరియా) బాధితులు, 22 మంది డయాలసిస్ రోగులకు పింఛన్లు ఇస్తున్నారు. అందుకు ప్రభుత్వం ప్రతి నెలా 14,79,41,624 వెచ్చిస్తున్నది.
జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా మెట్పల్లి, కోరుట్ల కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. గతంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ ఉండగా, డివిజన్ కార్యాలయాల్లో పనుల కోసం 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది. దీని వల్ల వ్యయ, ప్రయాసాలకు లోనుకావాల్సిన పరిస్థితి. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలకు కలిపి మెట్పల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయం, అలాగే కోరుట్ల మండలం, పట్టణ ప్రజలకు అందుబాటులో కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం అందుబాటులో ఉన్నది. వీటితోపాటు మెట్పల్లిలో పోలీస్ సబ్‌డివిజనల్ అధికారి, అటవీశాఖ రేంజ్ అధికారి, విద్యుత్ విభాగం డివిజనల్ ఇంజినీర్ అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రజలకు పాలన మరింతగా చేరువైంది.
రాష్ట్రం రాక ముందు వరద కాలువ నీరు లేక ఎడారిని తలపించేది. కానీ, స్వరాష్ట్రంలో సజీవంగా మారింది. సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద కాలువను వరద ప్రదాయినిగా మార్చారు. అందులో భాగంగా మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట శివారులో వరదకాలువపై పంప్‌హౌస్‌ను ఏర్పా టు చేశారు. జలధారగా మారిన వరదకాలువకు తూములను ఏర్పాటు చేసి, సమీప చెరువులు, కుంటలను నింపుతున్నారు. మరోవైపు భూగర్భజలాలు వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతున్నాయి.
పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలో ఏడు గురుకుల విద్యాలయాలను ప్రారంభించింది. మెట్లచిట్టాపూర్‌లో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల (బాలికల), అయిలాపూర్‌లో బాలుర గురుకుల విద్యాలయం, మెట్పల్లిలో బాలుర గురుకుల విద్యాలయం, మెట్పల్లి, కోరుట్లలో మైనార్టీ గురుకుల విద్యాలయం (బాలుర), మెట్పల్లిలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలికల), కోరుట్లలో (బాలుర) విద్యాలయం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో కలిపి 1600 మంది విద్యార్థులకు పైగా విద్యను అభ్యసిస్తున్నారు. ‘మన ఊరు- మన బడి’ కింద పాఠశాలల భవనాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే మెట్పల్లి పట్టణంలోని బంటుపేటలో ప్రాథమిక పాఠశాలలో పనులు పూర్తయ్యాయి. మిగతా పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.
94.05 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 21.35 కోట్ల వ్యయంతో 33/11 కేవీ సబ్స్టేషన్లను మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపేట, మల్లాపూర్ మండలం చిట్టాపూర్, సిరిపూర్, అడవిరేగుంట, వేములకుర్తి, వర్షకొండ, ఎర్దండి, అమ్మక్కపేట, డబ్బ వాటర్ గ్రిడ్, బండలింగాపూర్, సంగెం, మెట్లచిట్టాపూర్, చౌలమద్ది, మాదాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 36 సబ్స్టేషన్లలో 2014 నవంబర్‌లో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రతి సబ్‌స్టేషన్‌లో అప్పటికే ఉన్న ఒక్క పవర్ ట్రాన్స్ఫార్మర్కు అదనంగా ప్రతిచోట రెండో 5ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. 24 చోట్లలో 12.57 కోట్ల వ్యయంతో అదనంగా ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 7.60 కోట్ల వ్యయం తో 68 అదనపు వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్లను అమర్చారు.
రైతు బంధు కింద పంట పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి 10వేలు చొప్పున ప్రభుత్వం రైతులకు అందిస్తున్నది. ఏటా నియోజకవర్గంలో 50344 మంది రైతుల ఖాతాల్లో 52,38,45,757 జమచేస్తున్నది. రైతు బీమా 29695 మంది రైతులకు అమలవుతున్నది. రైతులు, వ్యవసాయానికి సంబంధించిన సమావేశాల కోసం ప్రభుత్వం నియోజకవర్గంలో 19 రైతు వేదికలను నిర్మించింది.
జంట పట్టణాలైన కోరుట్ల, మెట్పల్లి టౌన్ల సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు పట్టణాలకు 50 కోట్ల చొప్పున నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. 63 జాతీయ రహదారి ఈ రెండు పట్టణాల మీదుగా వెళ్తుంది. నాలుగు అడుగుల వెడల్పులతో డివైడర్లను ఏర్పాటు చేయడంతో విధంగా డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలు ఆహ్లాదాన్ని తలపిస్తున్నాయి. శ్మశాన వాటికల అభివృద్ధి, రహదారిలో ట్రాఫిక్‌ను నివారించేందుకు జంక్షన్ల నిర్మాణం, యువత కోసం ఓపెన్, ఇండోర్ జిమ్, చిన్నపిల్లల కోసం పార్కులు ఏర్పాటు చేశారు. కోరుట్ల పట్టణంలో పెద్దచెరువు మీని ట్యాంకు బండ్‌గా మార్చారు. అదే విధంగా మెట్పల్లి పట్టణ శివారులోని పెద్దచెరువును మినీ ట్యాంకు బండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. 6 కోట్ల వ్యయంతో అటు కోరుట్లలో, ఇటు మెట్పల్లిలో సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నారు.
కుల వృత్తినే నమ్ముకున్న గొల్లకుర్మలకు ప్రభుత్వం అండగా నిలిచింది. రాయితీపై ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించి గొర్రెల సంపద వృద్ధికి ప్రోత్సహించింది. ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్ మండలాలకు కలిపి ఇప్పటి దాకా 1694 యూనిట్లు కేటాయించగా 22.30 కోట్లు నిధులు విడుదల చేసింది. లబ్ధిదారులు గొర్రెల సంఖ్యను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నారు.
నియోజకవర్గంలో 78 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ఇబ్రహీంపట్నం మండలంలో 17, మెట్పల్లి మండలంలో 23, కోరుట్ల మండలంలో 15, మల్లాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక గ్రామ పంచాయతీలు సొంత భవనాలు లేక పోవడం, ఉన్నా అవి శిథిలావస్థలో ఉండడం, ఆపై ఇరుగ్గా ఉండడం వంటి సమస్యలతో ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో పక్కా భవనాలు లేని, శిథిలావస్థకు చేరిన జీపీ కార్యాలయాల కోసం కొత్త భవనాలు నిర్మించారు. ఒక్కో భవనానికి 20 లక్షలు, ఆపై నిధులను ప్రభుత్వం కేటాయించింది.