గోదావరిఖని, ఫిబ్రవరి 26: పదేళ్లు కేసీఆర్ హయాంలో పచ్చగా కళకళాడిన తెలంగాణ, కాంగ్రెస్ అసమర్థ పాలనలో కరువుకు కేరాఫ్‌గా మారిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ పరమశివుడి ఆశీస్సులతో రామగుండం నియోకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో సల్లంగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు.
అనంతరం గోదావరిఖని శివారులోని గోదావరి నదిని ఆయన సందర్శించారు. వెలవెలబోయిన నదిని చూసి ఆవేదన చెందారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరినదిని నిండుకుండలాగా మార్చారని, తాను ఎమ్మెల్యేగా తెప్పల పోటీలు నిర్వహించానని గుర్తు చేశారు. నిండుకుండలా మారిన గోదావరి ప్రస్తుతం నీళ్లు లేక గోదారి వెలవెలబోతున్నదని వాపోయారు. ఈ మహాశివరాత్రి పండుగ రోజు గోదావరిలో స్నానం చేసేందుకు సరైన నీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇక్కడ నాయకులు వెంకన్న, కోడి రామకృష్ణ, ఆవునూరి వెంకటేశ్, రామరాజు ఉన్నారు.