పెద్దపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ కాల్వశ్రీరాంపూర్: ఖమ్మం జిల్లాలోని వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంపై కాంగ్రెస్ నాయకులు గూండాల్లాగా దాడులు చేయడం సరికాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుపట్టారు. దాడి చేయడం హేయమైన చర్య అని, సిగ్గుచేటని ఖండించారు. దీనిని ప్రపంచం ఒప్పుకోదని విమర్శించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి దుర్మార్గపు ఘటనలు మరోసారి పునరావృతమైతే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలం కొత్తపెల్లి నక్కల ఒర్రె వరదలో చిక్కుకుని మృతి చెందిన కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన చెప్యాల పవన్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్‌తో కలిసి ఆయన మంగళవారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరదల్లో మృతిచెందిన వ్యక్తులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా డిమాండ్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడేమో కేవలం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వరదల్లో చిక్కుకుని మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో విపత్తు జరిగితే అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తమై చర్యలు తీసుకుంటే, రా్రష్ట్రంలోని మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రయోజనం శూన్యమని, వరదల్లో 24 మంది చిక్కుకుంటే కనీసం హెలీక్యాప్టర్ పెట్టక పోవడం శోచనీయమన్నారు. ఖమ్మం, జనగామ, హైదరాబాద్, కామారెడ్డిలో వరదలు వస్తే ప్రభుత్వ స్పందన కరువైందని విమర్శించారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ గంట రాములు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, బీఆర్ఎస్ నాయకులు తాత సాయికిరణ్, దేవయ్య, సువర్ణ బిట్టు, పుప్పాల నాగార్జునరావు, కొల్లూరి రాయమల్లు, మాదాసి రాంచంద్రం, సారంగపాణి ఉన్నారు.