కరీంనగర్, మే 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేరిట పేదలను నమ్మించి ముంచిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. దళితబంధు తీసుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని, ఇదేనా పథకం అమలు చేసే పద్ధతి అని నిలదీశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, త్వరగా నిర్మించుకోవాలని నిరుపేదలకు చెబితే నమ్మి ఉన్న ఇంటిని కూల్చుకున్నారని, తీరా జాబితాలో పేర్లు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇండ్లను తమ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో మొదటి ఏడాది 4.16 లక్షల మందికి ఇండ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం, అంతంతే మంజూరు చేసినందని పేర్కొన్నారు. ప్రజా పాలనలో ఇండ్ల కోసం 77.18 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని పరిశీలించిన ప్రభుత్వం 36.03 లక్షల మంది మాత్రమే అర్హులని ప్రకటించిందని, మిగతా 41.15 లక్షల మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో 57,141, అర్బన్ ప్రాంతాల్లో 38,094 ఇండ్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు.
600 చదరపు అడుగుల్లో ఒక్క అంగుళం దాటినా బిల్లుల చెల్లింపులు నిలిపి వేస్తున్నారని, అనేక మంది నిరుపేదలకు అన్యాయం జరుగుతున్నదని వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు వేసి ఇందిరమ్మ పేరిట కేటాయిస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆ పార్టీ నాయకులకు, అనుకూలంగా ఉన్న వారికి, డబ్బులు ఇచ్చిన వారికే ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకులే సోషల్ మీడియాల్లో వెలుగులోకి తెస్తున్నారని చెప్పారు.
ఊరూరా నిరసనలు తెలుపుతున్నారని, కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, కొంత మంది ఏకంగా ఆత్మహత్యకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేస్తే ఈ పథకం ఎలా అమలవుతుందని, మిగిలిన గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పథకం అమలులో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కారు, వ్యాను, ట్రాక్టర్ తదితర నాలుగు చక్రాల వాహనం ఉంటే ఇందిరమ్మ ఇంటికి అనర్హులుగా తేల్చుతున్నారని, ఈ పరిస్థితిహుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు.
ఈ నియోజకవర్గంలో 18,021 మంది దళిత బంధుకు ఎంపికైతే 8 వేల మంది వరకు వాహనాలు తీసుకున్నారని, వీరిలో అర్హులైన వారు కూడా వందల సంఖ్యలో ఉంటారని, వీరిలో ఒక్కరిని కూడా ఇందిరమ్మ ఇంటికి ఎంపిక చేయడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, దళితులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.