Kondagattu Hundi Income | మల్యాల: జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలోని 12 హుండీలను శుక్రవారం లెక్కించగా 25 రోజులకు గాను రూ.1,00,95,392 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. విదేశీ కరెన్సీ నోట్లు 44, భక్తులు సమర్పించిన మిశ్రమ వెండి వస్తువులు, బంగారు వస్తువులను సీలు వేసి హుండీలోనే భద్రపరచినట్లు తెలిపారు.
ఈసారి ఐపీఎల్లో రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు గెలవాలని ఓ భక్తుడు ఆంజనేయ స్వామి హుండీలో చీటీపై ‘భగవంతుడా నీవే ఈసారైనా ఆర్సీబీని గెలిపించాలంటూ’ చీటీ వేశారు. ఈ కార్యక్రమంలో హుండీ కౌంటింగ్ పర్యవేక్షకుడు రాజమౌళి, ఆలయ స్థానాచార్యులు కపిందర్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఆలయ పర్యవేక్షకులు హరిహరనాథ్, సునీల్, నీలా చంద్రశేఖర్, పోలీస్ శాఖ ఏఎస్ఐ చిలుక శ్రీనివాస్, సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.