Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 27 : తెలంగాణ ఉద్యమంలో కలిపితురాయి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని ఆదివారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం మొత్తం పోరాటాలు, త్యాగాల సమాహారమని అన్నారు.
తొలిదశ, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆయన తెలంగాణ రాష్ట్రం రాక ముందే మరణించడం దురదృష్టకరమని అన్నారు. వెనుకబడిన తరగతుల, దళిత, గిరిజన ప్రజల హక్కుల కోసం ఆయన నిరంతరం శ్రమించారని, ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం పద్మశాలీ సంఘాన్ని బలోపేతం చేసి, వారి ఆర్థికాభివృద్ధికి ఆప్కో సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలొ డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, కార్పొరేటర్లు వెంగళ బాపు, ముస్తాఫా, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, నాయకులు మారెల్లి రాజిరెడ్డి, రంజిత్, అభిషేక్, పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్, బూర్ల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

ఓదెల మండల కేంద్రంలో..
ఓదెల, సెప్టెంబర్ 27 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పద్మశాలీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పోరాట చరిత్రలో ఆధ్యాంతం ప్రజల గొంతుకై నిలిచిన నిస్వార్థ నాయకుడని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడిగా నిలిచిన గొప్ప మేధావిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘ నాయకులు క్యాతం వెంకటేశ్వర్లు, మెరుగు సారంగం, మెరుగు భీష్మచారి, శ్రీనివాస్, మల్లేశం, సతీష్, రాజేంద్రప్రసాద్, లింగమూర్తి, సదానందం తదితరులు పాల్గొన్నారు.