కేఎం కుమార్.. జగిత్యాల జిల్లాలోని ఒక ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నడు. దాదాపు 18 ఏండ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్నడు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నడు. వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇవ్వడంతో ఆర్టీసీ అధికారులను కలిసి తన పరిస్థితిని వివరించిండు. తనకు హాఫ్‌పే సెలవులు ఉన్నాయని, మంజూరు చేయాలని విన్నవించిండు. అయినా విధులకు కచ్చితంగా రావాల్సిందేనంటూ ఉన్నతాధికారులు చెప్పడంతో బిత్తరపోయిండు. పోనీ నాలుగు నేషనల్ హాలీడేలు ఉన్నాయని, వాటినైనా వాడుకోవడానికి అనుమతివ్వండి అని వేడుకున్నడు.
‘నేషనల్ హాఫ్ డేలు లేవు ఏం లేవు. నువ్వు కచ్చితంగా డ్యూటీ చేయాల్సిందే. లేదంటే నీ వేతనం కట్ అవుతుంది’ అని ఆర్టీసీ అధికారులు తేల్చి చెప్పడంతో కుమార్ బిక్కుమంటూ బిక్కుమంటూ డ్యూటీ చేస్తున్నడు. డ్రైవర్ జేవీ సాగర్‌ది కూడా ఇలాంటి బాధే. ఆయన తల్లికి ఆరోగ్యం బాగా లేదు. ఆమెను హైదరాబాద్ దవాఖానలోని చేర్పించాల్సిన పరిస్థితి. ఆర్టీసీ అధికారుల వద్దకు వెళ్లి సెలవు అడిగితే.. ‘కచ్చితంగా డ్యూటీ చేయాల్సిందే. మీకు లీవ్ కావాలంటే లాస్ ఆఫ్ పే పైన వెళ్లండి’ అని స్పష్టం చేయడంతో సాగర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఇది ఒక్క జగిత్యాల జిల్లా డిపోల్లోనే కాదు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న డిపోల్లో ఎందరో కార్మికులు ఇలానే బాధపడుతున్నారు. ఒత్తిడి తెస్తే భవిష్యత్తులో తమకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని భయంభయంగా పనిచేస్తున్నారు.
జగిత్యాల, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : నిబంధనల ప్రకారం ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు 8 గంటల పనితోపాటు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణానికి సంబంధించిన అంశం కావడంతో సౌలభ్యం, ప్రయాణ ప్రాధాన్యతలను బట్టి విధులను కేటాయిస్తూ వస్తున్నారు. అలాగే వీరికి ఏడాదికి 15 సాధారణ సెలవులను ఆర్టీసీ సంస్థ మంజూరు చేసింది. ఏడాదికి 4 నేషనల్ హాఫ్ డేలను సైతం సెలవులుగా ఇచ్చింది. ఆగస్టు 15, జనవరి 26తోపాటు గాంధీ జయంతి (అక్టోబర్ 2), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)ని లీవ్స్‌గా ప్రకటించింది.
అయితే ఆ రోజుల్లోనూ బస్సులు తిరుగుతాయి, కార్మికులు డ్యూటీ చేస్తారు. అందుకే ఆ నాలుగు రోజులను హాలీడేలుగా ప్రకటించింది. ఆ నాలుగు రోజుల్లో డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీ చేస్తే, ఇతర రోజుల్లో సెలవులు తీసుకొనే అవకాశం కల్పించింది. ఇవేకాకుండా ప్రతి పదేళ్ల కాలానికి 300 ఆఫ్పే సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ హాఫ్‌పే సెలవులను సైతం సెలవులుగా వినియోగించుకోవచ్చు. ఇలా కార్మికులకు సెలవులను సంస్థ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, కార్మికుల చట్టాలకు అనుగుణంగా మంజూరు చేసింది.
ఏడాదిన్నరగా సెలవుల నిషేధం?
ప్రస్తుతం ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిన్నరగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సెలువులు మంజూరు చేయడం లేదు. వీరు నిత్యం కచ్చితంగా పనిచేయాలన్న నిబంధనను ఆర్టీసీ సంస్థ అమలు చేస్తున్నది. ఏడాదికి 15 సాధారణ సెలవులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, మం జూరు చేయడం లేదని తెలిసింది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయా ణం ప్రారంభించినప్పటి నుంచి డ్రైవర్లు, కండక్టర్లపై తీవ్ర ఒత్తిడి మొదలైంది.
కొత్తగా ఆర్టీసీ సిబ్బంది నియామకం లేకపోవడంతో ఉన్న స్టాఫ్‌పైనే భారం పడుతున్నది. దీంతో సెలవులు మంజూరు చేయకుండా ఉన్న వారిపైనే తీవ్ర ఒత్తిడిని పెడుతుండడంతో డ్రైవర్లు, కండక్టర్లు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సెలవుల విషయం, తీవ్ర ఒత్తిడితో కూడిన పనిపైన ఒక కండక్టర్ మాట్లాడుతూ, ‘సార్ మా పరిస్థితి దారుణంగా తయారైంది. సెలవు ఇవ్వండి అంటేనే అధికారులు పురుగును చూసినట్టు చూస్తున్నరు. హాఫ్‌పే సెలువులను వాడుకునే పరిస్థితి ఎప్పుడో వెళ్లిపోయింది. కనీసం క్యాజువల్ లీవులు సైతం ఇవ్వడం లేదు. ఈ ఒత్తిడి తట్టుకోలేక పోతున్నం. యాభై ఏండ్లు దాటినయి. ఇంత ఒత్తిడితోటి పనిచేస్తే ఏమైతదో. ఎండకు, ఈ టెన్షన్‌కు కాళ్లు, చేతులు పడిపోతాయో తెలియడం లేదు సార్’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
భయం.. భయంగా విధులు
కొన్నాళ్లుగా ఆర్టీసీ విషయంలో సర్కారు వ్యవహారశైలి సరిగ్గా లేదనే విమర్శలున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల జూన్ 2న రాష్ట్ర అవరతరణ దినోత్సవం సందర్భంగా మెర్జర్డే అవుతుందని కార్మికులు భావించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఆర్టీసీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకువెళ్లే సమయంలో వీలైనంతగా డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికుల సంఖ్యను కుదించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కార్మికులు అనుమానం వ్యక్తం చే స్తున్నారు. సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచడం వల్ల కొంతమంది తప్పులు చేసే అవకాశముంటుందని, అలాగే సంస్థను వదిలిపెడుతారని, ఇది ప్రభుత్వానికి కొంత వరకు మేలు చేస్తుందన్న భావనలో ఆర్టీసీ అధికారుల వ్యవహారశైలి ఉందని విమర్శిస్తున్నారు.
సెలవులు నిరాకరించడం, హక్కులను సైతం హరించి వేయడం అంతా అందులో భాగమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకునే సమయంలో తాము సెలవుల కోసం ఒత్తిడి తెస్తే తమకు భవిష్యత్తులో ఎక్కడ అన్యాయం జరుగుతుందోననే భయంతో సెలువులు లేకుండా తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్నామని వాపోతున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. తాము సైతం మనుషులమేనని, బానిసలం కాదన్న విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు గుర్తించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా తమ ఆరోగ్యం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని సెలవులు మంజూరు చేయాలని, అదనపు పని భారం మోపద్దని కోరుతున్నారు. కాగా ఈ విషయమై ఆర్టీసీ ఆర్ఎం వివరణ కోసం ప్రయత్నించగా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.