జగిత్యాల, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల/ రాయికల్ : జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల వైపే చూస్తున్నదని, జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇన్ని రోజులు ఇక్కడి ప్రజలు తన కష్టసుఖాల్లో ఒక కుటుంబంగా తోడున్నారని, ఇప్పుడు కూడా తోడుగా అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో జరిగే సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ నెల 20న జగిత్యాల వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా మంగళవారం జగిత్యాలలోని జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ వొద్దినేని హరిచరణ్ రావు ఇంట్లో సన్నిహితులతో సమావేశమయ్యారు. అనంతరం రాయికల్‌లోని పద్మశాలీ సేవా సంఘం కల్యాణ మండపంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ‘రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నానని, ఆయనతో రాజకీయ ప్రయాణం చేయడం కొత్త అనుభూతినిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే అంతకుమించి ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసిందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఊడుం సొచ్చినట్లు సొచ్చిండని, ఆయనది ఐరన్‌లెగ్ అని విమర్శించారు. రెండున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ దశాబ్దకాలం కృషిచేశారని, రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోతే పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్‌ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా మరమ్మతులు చేపట్టలేదని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో రాయికల్ మండలం బోర్నపెల్లి వంతెనకు రూ.70 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే ఒకటే మార్గమని, అభిమానులు, నాయకులు, కార్యకర్తల తోడు అందరి సహకారంతో ముందుకు సాగుదామన్నారు.
జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, పురుషోత్తం రావు మాట్లాడుతూ, జీవన్‌రెడ్డిని పార్టీలోకి మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. నిస్వార్థంగా సేవ చేసే, నిబద్ధతగా కలిగిన జీవన్ రెడ్డికి అందరం సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, రాయికల్ మున్సిపల్ చైర్పర్సన్ రవి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు దావ సురేశ్, శీలం ప్రవీణ్, తురగ శ్రీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.