కరీంనగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ అంటే సమరశీలుడు.. ప్రగతికాముకుడు. ఆయన ఏ పని చేసినా మేథోమదనం చేయనిదే నిర్ణయం తీసుకోరు. ఒక రక్తపు చుక్క పడకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప ఉద్యమకారుడు. ప్రజలకు సులువుగా.. నేరుగా ప్రభుత్వ పథకాలు అందాలని ఆకాంక్షించిన నాయకుడు’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడు, ఉద్యమ సహచరుడు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు స్పష్టం చేశారు. కరీంనగర్ అంటే ఆయనకు ప్రత్యేకమైన సెంటిమెంటని, ఇక్కడి ప్రజలు విప్లవకారులు, ఉద్యమకారులను గొప్పగా ఆదరిస్తారని తరుచూ చెప్పేవారని, అందుకే ప్రతి కీలక విషయానికి కేసీఆర్ కరీంనగర్‌నే ఎంచుకునేవారని చెప్పారు. సోమవారం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా లక్ష్మణ్‌రావు ‘నమస్తే తెలంగాణ’తో ఆదివారం ప్రత్యేకంగా మాట్లాడారు. ‘కేసీఆర్ ఒక అధ్యయన గ్రంథం. ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకున్న. ఆయనను ఉద్యమకారుడిగా చూసిన.
ముఖ్యమంత్రిగా చూసినా ఏనాడు ఆయన తనకోసం ఆలోచించలేదు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల గురించే ఆలోచించేవారు. నిరంతరం రాజకీయాల గురించే చర్చించేవారు. ప్రజలకు ఏం చేయాలి? వారిని అభివృద్ధిలోకి ఎలా తేవాలి? అనే పరితపిస్తుంటారు. ఆయనొక సమకాలీన రాజకీయ పరిశోధకుడు. ఏ పని చేసినా ముందు మేధోమదనం చేస్తారు. తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు చేసేలా ఉండాలని ఆకాంక్షిస్తారు. ప్రజల కోసం పని చేయాలన్న తపనే ఆయనను ఈ స్థాయికి తెచ్చింది. గొప్ప మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. ఉద్యమంలో ఉన్నప్పుడు ఊరూవాడను ఏవిధంగా ఏకం చేశారో అభివృద్ధిలో కూడా అదే విధంగా ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకున్నారు.
నాకు తెలిసి భవిష్యత్ గురించి ఆలోచించే నాయకుడు మరొకరు లేరు. కేసీఆర్ అంటే మంచి మోటివేటర్ కూడా. కేసీఆర్ పాల్గొనే ఏ కార్యక్రమానికైనా, సమావేశాలకైనా హాజరుకాకుంటే ఏదో వెలితిగా ఉండేది. కార్యకర్తలైనా, నాయకులైనా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరికి మంత్రులైనా కేసీఆర్ మీటింగ్ అంటే తప్పక హాజరుకావాలని అనుకునేవారు. ఒకవేళ హాజరుకాకుంటే బాధపడేవారు’ అని గుర్తు చేశారు. ‘కరీంనగర్ జిల్లా ప్రజల్లో చైతన్యం ఉంటుందని, ఇక్కడి ప్రజలు ఎంతో గొప్పగా ఆలోచిస్తారని తరుచూ చెప్పేవారు. అభివృద్ధి చేపట్టేందుకు ఈ జిల్లాలో అనేక వనరులు ఉన్నాయని, అభివృద్ధి చేయడంలో నాయకులు విఫలమయ్యారని అంటారు. దేనికైనా ఒక విజన్ ఉండాలని, విజన్‌తో వెళ్లే నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతాడని చెబుతారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత తనకు కొండంత అండగా నిలిచిన కరీంనగర్‌ను ఏనాడు మర్చిపోలేదు. అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులిచ్చి ప్రోత్సహించారు. కేసీఆర్‌కు మన జిల్లాకు ఉన్న అనుబంధం గొప్పది’ అని వివరించారు.