కార్పొరేషన్/కొత్తపల్లి, సెప్టెంబర్ 11: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 17న జరిగే బంజారాల ఆత్మగౌరవ సభ, బంజారా భవన్ ప్రారంభోత్సవానికి సంబంధించి చింతకుంట ఎంపీటీసీ భూక్యా తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన స్థానిక ప్రతిమ మల్టీప్లెక్స్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని కులాల వారికి హైదరాబాద్‌లో స్థలం కేటాయించి సంఘ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, బంజారా భవన్‌కు స్థలం కేటాయించి, రూ.50 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, టీఆర్ఎస్ నాయకుడు రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.