జగిత్యాల రూరల్/ సారంగాపూర్/ రాయికల్, ఏప్రి ల్ 17: కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలంతా విసుగెత్తిపోయారని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనే బాగుందని, మళ్లీ ఆయనే రావాలని ప్రజలందరూ కోరుకుంటాన్నరని చెప్పారు. కేసీఆర్, జీవన్‌రెడ్డి కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు వస్తుందని చెప్పారు. ఈ నెల 20న నిర్వహించే జగిత్యాల సభతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతీ గ్రామం నుంచి పెద్దసంఖ్యలో తరలిరావాలని, సభను జయప్రదం చే యాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సభ నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన జగిత్యాల నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ముందుగా జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్, అనంతరం సారంగాపూర్, బీర్పూ ర్.. ఆ తర్వాత రాయికల్‌లో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయాచోట్ల జన సమీకరణ, వాహనాల ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల పోరాటాల గడ్డ అని గుర్తు చేశారు. ఈ గడ్డపై కేసీఆర్ నిర్వహించే సభకు ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడిలా కదలాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగిందని, పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ఆ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమ లు చేయలేదని మండిపడ్డారు. మోసం చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కేసీఆర్ సభతో కాంగ్రెస్ పతనానికి నాంది పడుతుందని హెచ్చరించారు. పద్నాలుగేళ్లుగా తాను కేసీఆర్‌తో కలిసి పనిచేస్తున్నానని, జీవన్‌రెడ్డిని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదని చెప్పారు.
ఇప్పుడు కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి కలిసి పనిచేయడం రాష్ర్టానికి శుభసూచకమన్నారు. ప్రజలు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై విసుగు చెందారని, ‘రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ కోరుకుంటున్నారని చెప్పారు. ఆయాచోట్ల సన్నాహక సమావేశాల్లో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కటకం రవి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు అనిల్, పార్టీ జగిత్యాల, రాయికల్ మండలాధ్యక్షులు ఆనందరావు, మల్లేశ్ యాదవ్, లక్ష్మీపూర్ సర్పంచ్ కవిత స్వామి రెడ్డి, మాజీ సర్పంచ్ జాన్, మాజీ ఎంపీటీసీ సునిత లక్ష్మణ్, ప్యాక్స్ మాజీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నాయకులు చిన్న గంగయ్య, రాజిరెడ్డి, మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మొదటి విజయాన్ని చూశాం
కేసీఆర్, జీవనన్న కలిసిన సందర్భంగా మొదటి విజయాన్ని చూశాం. మేడిగడ్డను ఏదో విధంగా అన్యాయం చేయాలని, రైతాంగం నోట్లో మట్టి కొట్టాలని చూసిన రేవంత్ రెడ్డికి కనువిప్పు కలిగింది. నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేసే నాయకత్వం లక్ష్మీపూర్‌లో ఉన్నది. మీరంతా కేసీఆర్ సభకు తరలిరావాలి. జీవన్ రెడ్డి, నేను అభివృద్ధి కోసం పోటీ పడి పనిచేశాం. ఎన్నడు కూడా సిద్ధాంత పరంగా విభేదించామే తప్ప కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఏనాడూ అన్యాయం చేయలేదు. మా ఇద్దరి కలయికతో డబుల్ అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
పెద్ద సంఖ్యలో తరలిరావాలి
కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక బంగారు తెలంగాణను నిర్మించుకున్నాం. కేసీఆర్ పాలనలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. జీవన్ రెడ్డి కూడా గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం విభేదించి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఇది ఒక శుభ పరిణామం. అందరం కలిసి కట్టుగా పాతకొత్త అనే తేడా లేకుండా పనిచేద్దాం. కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజవంతం చేద్దాం.
– దావ వసంత, జగిత్యాల జడ్పీమాజీ చైర్పర్సన్