భవిష్యత్ మనదే. భయం వద్దు. కష్టకాలంలో నావెంట నిలిచిన మీకు ఎప్పుడూ అండగా ఉంటా. రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దాం. సమష్టిగా కష్టపడితే కరీనంగర్‌లో విజయం మనదే. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేద్దాం. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే సత్తా ఉన్న నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. వచ్చే నెల 10న సిరిసిల్లలో నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షోకు ప్రతి కార్యకర్త తరలిరావాలి. అన్ని చోట్ల నుంచి వచ్చి విజయవంతం చేయాలి.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీపై వ్యతిరేకతతో బీఆర్ఎస్కు 8 నుంచి 10 స్థానాలు వస్తాయంటూ పలు సర్వేలు చెబుతున్నాయని జోస్యం చెప్పారు. రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేస్తే కరీంనగర్ సీటు మనదేనని చెప్పారు. వినోదన్న గెలిస్తే కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లాధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన సోమవారం జరిగిన పట్టణ క్లస్టర్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్లకు చేరుకున్న ఆయన రాత్రి వరకు వార్డుల వారీగా కార్యకర్తలతో చర్చించారు. పట్టణంలోని 39 వార్డులకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజార్టీ తేడాతో కాంగ్రెస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలపై గడపగడపకూ వెళ్లి ప్రజలతో చర్చించాలని సూచించారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజల పక్షాన ఉండి కొట్లాడుదామన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటు వేయక పోతే ఫ్రీబస్సు తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని, దీనిపై ప్రజలు ఆలోచన చేస్తున్నారని చెప్పారు.
పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ కరీంనగర్‌కు ఏం చేశాడని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్కగుడి కట్టాడా..? ఒక్క బడి తెచ్చాడా..? పరిశ్రమలను తీసుకొచ్చాడా..? అంటూ ఫైర్ అయ్యారు. ఒక్క రూపాయి పనిచేయని బండికి ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. పదేండ్ల మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఫలితంగా సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నాడని తెలిపారు. తెలంగాణకు ఏమీ చెయ్యని బీజేపీకి, కరీంనగర్‌కు నయాపైసా పనిచెయ్యని బండి సంజయ్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజల్లో చర్చ పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.
కష్టకాలంలో తనవెంట నిలిచిన కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడతానని కేటీఆర్ చెప్పారు. పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్ మనదేనని, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటితే పార్టీకి పూర్వవైభవం వస్తుందని చెప్పారు. మన నుంచి లబ్ధిపొందిన నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారని, వారి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, బీఆర్ఎస్ నాయకులు చీటి నర్సింగారావు, టీఎస్‌టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాయకులు బొల్లి రాంమోహన్, అన్ని వార్డుల కౌన్సిలర్లు, వార్డు కమిటీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.