జగిత్యాల, మే 6 : రాష్ట్రానికి బీఆర్ఎస్, కేసీఆరే శ్రీరామరక్ష అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత స్పష్టం చేశారు. ఆయన అప్పు చేసి తెలంగాణకు సంపద సృష్టించారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన సంపద.. చేసిన అభివృద్ధి ఏదో చూపించాలని డిమాండ్ చేశారు. అయినా ఒక ఇంటి యాజమాని సక్రమంగా ఉంటేనే ఇల్లు బాగుంటుందని, అలాగే రాష్ట్ర సీఎం బాగుంటేనే ప్రజలు బాగుంటారని చెప్పారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పు చేసి సంపద సృష్టించారని, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు, రైతుబంధు, రైతు బీమా, వృద్ధులకు, మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్లు, గొర్రెలు, చేప పిల్లలు అందించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే లక్షా 60 వేల కోట్ల అప్పు చేసిందని, అయినా ఏ ఒక వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. కనీసం కేసీఆర్ నాటిన మొక్కలకు కనీసం నీళ్లు పోసే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పాలనలో సర్పంచులకు గౌరవంతో పాటు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు లేక కార్యదర్శులు తీవ్ర ఒత్తిడితో పని చేస్తున్నారని, కరెంటు బుగ్గపోతే కొత్తది పెట్టే పరిస్థితి లేదన్నారు. పట్టణ, పల్లె ప్రగతి పేర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చకపోతే వేరే పేర్లు పెట్టి అయినా ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి అందాల పోటీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
ఈ పోటీలు పల్లె ప్రజల కడుపు నింపుతాయా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లేని నిధులు అందాల పోటీలకు ఎకడివని నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపంగి నూనె కావాలన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన పద్ధతి చూస్తే రేవంత్రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సమావేశంలో ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మహేశ్, అర్బన్ మండలాధ్యక్షుడు తుమ్మ గంగాధర్, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, మాజీ సర్పంచ్లు బుర్ర ప్రవీణ్ గౌడ్, తిరుపతి, అంజన్న, పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.