ఇల్లంతకుంట, జూన్ 10 : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షగట్టి, ఆయన ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతోనే సీఎం రేవంత్‌రెడ్డి నోటీసులు ఇప్పించారని, ఇది రాక్షస ఆనందమేనని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) రిజర్వాయర్ కట్టపై బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కటౌట్‌కు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని బీడు భూములను కాళేశ్వరం నీటితో పచ్చని పంట పొలాలుగా మార్చిన కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ఓర్వలేనితనమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి రైతులను రాజులను చేయడానికి కేసీఆర్ చేసిన కష్టాన్ని ఎవరూ మరిచిపోరని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
అనంతరం పల్లె నర్సింహారెడ్డి మాట్లాడుతూ, నెర్రెలు బారిన నేలలో పసిడి పంటలు పండించే రాష్ట్రంగా మార్చినందుకు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా..? అని నిలదీశారు. మండుటెండల్లోనూ గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొర్లి గ్రామాల్లో చెరువులు, కుంటలు మత్తడులు దుంకించినందుకు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు చేస్తూ కాలం గడపడమే తప్ప రెండేళ్ల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రోండ్ల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచులు సిద్ధం శ్రీనివాస్, కముటం రాములు, మధు, ఉడుతల వెంకన్న, మాజీ ఎంపీటీసీ పరశురాం, నాయకులు కేవీఎన్ రెడ్డి, తూటి పరశురాం, శ్రీనివాస్, అనిల్, రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.