ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళిత బంధు పథకంపై తన వైఖరిని మార్చుకున్నది. దళితుల నిరంతర పోరాటాలు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చట్ట సభలు, సమీక్షా సమావేశాల్లో గళమెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం పధ్నాలుగు నెలలుగా ఖాతాలపై విధించిన ఆంక్షలను ఎత్తేసింది. పోలీసుల నిర్బంధాలు, అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ హుజూరాబాద్ దళితులు చేసిన పోరాటంతో రాష్ట్రంలోని దళితులకు న్యాయం జరిగినట్టయింది. దళిత బంధు ఖాతాలపై ఫ్రీజింగ్ తీసేయడంతో నియోజకవర్గంలోని 8,148 మంది దళిత కుటుంబాలకు రెండో విడుత సాయం అందబోతుండగా, ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం కసరత్తు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది.
కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో వెలుగులు నింపి, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ను తెచ్చారు. మొదటగా హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. 2021 ఆగస్టు 15న అక్కడే ప్రారంభించి దళితుల్లో ఉత్తేజాన్ని నింపారు. పథకం అమలు కోసం సర్వే నిర్వహించిన అధికారులు నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో 18,021 మంది లబ్ధిదారులను గుర్తించారు.
ఒక్కో యూనిట్‌కు 10 లక్షలు మంజూరు చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, 9.90 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి, 10 వేలు దళిత సంక్షేమ నిధికి జమ చేసింది. అయితే, లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను బట్టి కొంతమందికి పూర్తి స్థాయిలో, మరి కొంతమందికి అవసరాన్ని బట్టి ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ రకంగా 9,873 మందికి పూర్తి స్థాయిలో ఆర్థిక సాయాన్ని అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మిగిలిన 8,148 మందికి వారి అవసరాన్ని బట్టి ఆర్థిక సాయాన్ని విడిపించుకునే అవకాశం ఇచ్చింది.
మిగతా మొత్తాన్ని విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుండగానే 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఎన్నికల కమిషన్ దళితబంధు పథకంపై ఆంక్షలు విధించడంతో రెండో విడుత ఆర్థిక సా యం లబ్ధిదారులు విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికి లబ్ధిదారుల ఖాతాల్లోనే ఉన్న నిధులను ఎన్నికల తర్వాత కూడా విడిపించుకోవచ్చని భావించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ ఖాతాల్లో ఉన్న దళిత బంధు ఆర్థిక సాయాన్ని తమ వ్యాపార అవసరాలకు విడిపించుకునే ప్రయత్నం చేశారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో దళితబిడ్డలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 14 నెలలుగా ఖాతాలను ఫ్రీజింగ్ ఉంచడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తమ ఖాతాల్లో ఉన్న డబ్బులు తాము విడిపించుకునేందుకు ప్రభుత్వ ఆంక్షలేమిటని దళితబిడ్డలు అధికారులను ప్రశ్నించారు. తాము ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయక తప్పదని అధికారులు బదులిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు దళితబంధు సాధన సమితి పేరిట ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఆందోళనలు ప్రారంభించారు. అనేక పోరాటాలు, నిరసనలు జరిగాయి. ప్రజావాణిలో విన్నవించుకోవడం మొదలుకుని ధర్నాలు, రాస్తారోకోలు అనేకం జరిగాయి. అధికార కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్ సహా వివిధ రాజకీయ పక్షాలు వీరికి మద్దతుగా నిలిచాయి. నిరంతర పోరాటాలు చేస్తున్న దళిత బంధు సాధన సమితిపై పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి.
దళితులు ఏదైనా నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిసిన వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం మొదలు పెట్టారు. దీంతో దళితుల్లో మరింత పట్టుదల పెరిగి, కొద్దిరోజుల క్రితం వేలాది మంది హుజూరాబాద్ పట్టణాన్ని దిగ్బంధించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పోలీసులు దళితులతోపాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై విచక్షణారహితంగా విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే సహా పలువురు గాయపడ్డారు. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. దళిత బంధు సాధన సమితి నాయకులు కొలుగూరి సురేశ్ సహా పలువురిని 23 సార్లు వివిధ పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు.
దళితబంధు విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా తనకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గళమెత్తారు. అసెంబ్లీలో రచ్చ రచ్చ చేశారు. జడ్పీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట దళితబంధుపై అధికారులను నిలదీశారు. గొడవ పెరడగంతో ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. ఈ నెల 12న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కూడా దళితబంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదుర్కొంటున్న పరిస్థితులపై విన్నవించారు.
దళితులపై ఎన్ని ఆంక్షలు విధించినా వెరవకుండా దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో వరుసగా ఆందోళనలు చేస్తూ ప్రభుత్వానికి సెగ పెట్టారు. ఈ నెల 22న జమ్మికుంటలో ఒక సభ కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 5లోగా దళిత బంధు రెండో విడతపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తామని దళితులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చినట్టయింది. దళితబంధు లబ్ధిదారుల ఖాతాలపై ఆంక్షలు తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
అయితే దళిత బంధు ఖాతాలపై ప్రభుత్వం 14 నెలలుగా ఆంక్షలు విధించడంతో లబ్ధిదారులు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. రెండో విడుత ఆర్థిక సాయం అందుతుందని భావించి అప్పులు తెచ్చుకుని వ్యాపారాలు నడుపుకొంటున్నారు. ఆర్థికంగా లేక పోవడంతో పూర్తి స్థాయిలో వ్యాపారాలు నిర్వహించుకోలేక పోతున్నారు. కొందరైతే బిజినెస్ పక్కన బెట్టి మునుపటిలా కూలీ నాలీ చేసుకుని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పథకంపై ఆంక్షలు తొలగించడంతో దళితులు తమ విజయంగా భావిస్తున్నారు. నిత్య పోరాటాలతో ప్రభుత్వం దిగొచ్చి దళిత బంధు రెండో విడుత నిధులపై ఫ్రీజింగ్ ఎత్తివేసిందని లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు ఆనందపడ్డారు. బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. జమ్మికుంటలోని తెలంగాణ చౌక్ వద్ద దళిత సంఘం నాయకుడు మంద రాజేశ్ ఆధ్వర్యంలో ‘దళిత బంధు’వులు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
అధికారులు తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 9,937 మంది దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడుత కింద 324.75 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 8,148 మందికి 271.60 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యూలర్ అనుసారంగా దళిత బంధు రెండో విడతపై ఆంక్షలు తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో మరోసారి పరిశీలన జరిపే అవకాశం ఉన్నది. అయితే, బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరికొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, దాదాపు 18వేల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలపై ఫ్రీజింగ్ విధించింది. రెండో విడుత కింద వారికి చెందాల్సిన లబ్ధికి అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలో దళితుల తరఫున తాను అలుపెరుగని పోరాటం చేసి, ప్రభు త్వం మెడలు వంచడం సంతోషంగా ఉన్నది. ఇప్పటికైనా దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. లే కుంటే పోరాటాలకు సిద్ధంగా ఉంటాం.
– వీడియో సందేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి