18 టీఎంసీలకు చేరిన ఎల్ఎండీ జలాశయం
బోయినపల్లి/తిమ్మాపూర్ రూరల్, జూలై 19: ఉమ్మడి కరీంనగర్ జలాశయాల్లోకి స్వల్ప వరద వస్తున్నది. ఈ క్రమంలో బోయినపల్లి మండలం మాన్వాడ ఎస్ఆర్ఆర్ జలాశయానికి ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 15వేల క్యూసెక్కులు, మూల వాగు ద్వారా 6429 క్యూసెక్కల నీరు రాగా జలాశయం నిండుకుండలా మారింది. దీంతో మంగళవారం ఆరు గేట్ల ద్వారా దిగువన ఉన్న ఎల్ఎండీ జలాశయానికి 21429 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు జలాశయం ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. జలాశయంలో ప్రస్తుతం 19 టీఎంసీల నీరు ఉన్నట్లు వెల్లడించారు.
ఇక పైన కురిసిన వర్షాల వల్ల శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో ఎల్ఎండీ జలాశ యం క్రమంగా నిండుతున్నది. ఇప్పటివరకు 29,031క్యూసెక్కుల నీటి ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇందులో మోయతుమ్మెద వాగు నుంచి 6055 క్యూసెక్కులు, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి 21,276 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 1700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో 24 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్ఎండీ మంగళవారం రాత్రి వరకు 18టీఎంసీలకు చేరుకుంది. ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే వారం రోజుల్లో ఎల్ఎండీ నిండే అవకాశాలున్నాయి.
నిండుగా ఎల్ఎండీ జలాశయం