మన కరీంనగర్లో ఆటో షో రేపటి నుంచే మొదలు కాబోతున్నది. అంబేద్కర్ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్పో, శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నది. ఆదివారం సాయంత్రం 8 గంటలకు ముగియనున్నది. సందర్శకులకు ఉచిత ప్రవేశం ఉండనున్నది. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఈ షోను నిర్వహిస్తుండగా.. ఒకే వేదికపై బ్రాండెడ్ కంపెనీల కార్లు, బైక్‌ల గురించి, అలాగే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే లోన్ల గురించి తెలుసుకోవచ్చు! అలాగే మరింత సమాచారం కోసం 9182777022, 9182777571 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు!
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 20 : ఒకప్పుడు వాహనం అంటే కేవలం ప్రయాణానికే అన్నట్టు ఉండేది! కానీ, నేడు వాహనం ప్రయాణంతోపాటు ఆధునిక ఫీచర్లతో ఆకర్శిస్తున్నది. రోడ్ మ్యాప్, ఫోన్ చార్జింగ్, డిజిటల్ మీటర్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్.. ఇంకా అనేక సదుపాయాలు ఉంటున్నాయి. అన్నిటికంటే మించి సేఫ్టీ సౌకర్యాలు పెరుగుతున్నాయి. కంపెనీలు కూడా వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త మోడళ్లలో కార్లు, బైకులను అందుబాటులోకి తెస్తున్నాయి.
తక్కువ ధరలోనే ఆధునిక ఫీచర్లతో అందిస్తున్నాయి. యువత కోసం ప్రత్యేక ఫీచర్లతో స్పోర్ట్స్ బైకులను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్కువగా మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు లోన్లు ఇస్తుండగా, ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. రెగ్యులర్ వాహనాలతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. మెయింటనెన్స్ తక్కువ ఉండడంతో వీటిని ఎక్కువగా కొంటున్నారు. ముఖ్యంగా ఆర్టీఏ రిజిస్ట్రేషన్ అవసరం లేని తక్కువ స్పీడ్‌తో వెళ్లే విద్యుత్ ద్విచక్ర వాహనాలను తీసుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల కంపెనీలు ఆధునిక సౌకర్యాలతో ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడం, ఒక్కసారి చార్జ్ చేస్తే అత్యధిక దూరం ప్రయాణించే అవకాశం ఉండడంతో వీటిపైనా ఆసక్తి చూపుతున్నారు.
కొనుగోలుదారులకు మంచి అవకాశం!
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వాహనాల వినియోగం పెరుగుతున్నది. కార్లు, బైక్‌లు కొనేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. అయితే కొనే ముందు మార్కెట్లో వివిధ కంపెనీల నయా మోడల్ వాహనాల గురించి తెలుసుకోవడం కొనుగోలుదారులకు కష్టంగా ఉంటున్నది. రోజుకో షోరూం చుట్టూ తిరిగితేగానీ సమాచారం దొరకదు. రోజుకో బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థకు వెళ్తే గానీ లోన్ వివరాలు తెలియవు. కానీ, వాహన కొనుగోలుదారులందరికీ ఒకే వేదికపై సకల సమాచారం అందించాలన్న ఉద్దేశ్యంతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఆటో షో నిర్వహిస్తున్నారు.
ఈ షోలో ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల సంస్థలు పాల్గొననున్నాయి. వీటితో పాటు రుణాలు అందించే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ షోకు ఆదర్శ ఆటోమోటివ్స్ మెయిన్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తుండగా, హైదరాబాద్ నుంచి మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి అత్యంత విలాసవంతమైన కార్లతోపాటు ఎంజీ, నిస్సాన్, హుందాయ్, నెక్సా, ఎథర్, ట్రూవాల్యు, వరుణ్ మోటర్స్, సిట్రాన్, టయోటా, గ్రీన్ హోండా, కియా, హీర సుజీకి, యమహా, శ్రీ ఎంటర్ ప్రైజెస్ ఎలక్ట్రికల్ వెహికిల్స్, జెన్సిస్ జెన్ సోలార్, గ్రావుటన్ ఈ బైక్స్ వంటి కంపెనీల వాహనాలు రానున్నాయి. వీటితోపాటు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంకుతోపాటు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందుబాటులో ఉండనున్నాయి.