Karimnagar | ముకరంపుర, ఫిబ్రవరి 2: రైల్వే ఉద్యోగులకు 8వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు యూనియన్ నాయకులు, ప్రతినిధులు తమ డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులు, కార్మికులకు 8 వ వేతన సంఘం సిఫార్సులను సత్వరమే అమలు చేయాలని, జనవరి 1 నుంచి ఉద్యోగులు, పింఛన్ దారులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సేఫ్టీ కేటగిరీలో పనిచేస్తున్న వారందరికీ రిస్క్ హార్ట్ షిప్ అలవెన్స్, ట్రాక్ మెయింటనెర్లకు రిస్క్ అలవెన్స్ పెంచాలని కోరారు. ట్రాక్ మెయింటనర్ల గ్రేడ్ పే విలీనంతో పాటు రూ.4,200 గ్రేడ్ పే చెల్లించాలని కోరారు. రైల్వే సిబ్బంది తల్లిదండ్రులకు ప్రివిలేజ్ సౌకర్యం కల్పించాలని, సీలింగ్ పరిమితి లేకుండా ఉద్యోగుల మూల వేతనం ఆధారంగా ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెరిగిన సర్వీసులు, కొత్త లైన్ల ఏర్పాటుకు అనుగుణంగా పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. కేంద్రం మొండి వైఖరి వీడి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బ్రాంచ్ చైర్మన్ రవీందర్, సెక్రటరీ ప్రశాంత్, ట్రెజరర్ తిరుపతి, వైస్ చైర్మన్ రాజేశ్, వెంకటేష్, హరీష్, భూపతిరెడ్డి, నరేష్, తాజుద్దీన్, పెద్ది శ్రీనివాస్, శంకర్ రెడ్డి, రవి, కార్మికులు పాల్గొన్నారు.