తెలంగాణచౌక్, అక్టోబర్14 : పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్ధేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగ ర్జిల్లా మున్నూరుకాపు సంఘం భగ్గుమంది. ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సంఘం నాయకులు కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచుతూ దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు.
సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌పై విమర్శలు చేయలేదని, కేవలం బీసీలకు అన్యాయం జరుగుతున్నదని, పార్టీలో గౌరవం దక్కడం లేదనే ఆవేదనతో రాజీనామా చేస్తే వారించాల్సింది పోయి రేవంత్‌రెడ్డి అహకారంతో మాట్లాడారని మండిపడ్డారు. పదవుల కోసం రేవంత్ దేనికైనా ఒడిగడుతాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో మున్నూరు కాపుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నాయకులు కర్ర శేఖర్, సంతోష్ పటేల్, రవి, మల్లేశం, సునీల్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.