కరీంనగర్ రాంనగర్ మే 23: రాష్ట్రంలోనే సంచలనం రేపిన కరీంనగరంలోని పీఎంజే జ్యువెల్లరీలో నగల దోపీడీ కేసులో మరో కోణం వెలుగుచూసింది. దర్యాప్తులో పోలీస్ యంత్రాంగం రోజురోజుకు పురోగతి సాధిస్తున్నది. అయితే నిందితులకు తుపాకులు అందించిన మధ్యవర్తులు.. నిందితులు సరైన మార్గంలో వెళ్తున్నారా..? లేదా అనే అనుమానంతో వారిని కారులో అనుసరించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ కారులో ఎంత మంది వచ్చారు..? తిరిగి ఏ మార్గంలో వెళ్లారు..? అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే కరీంనగర్‌కు చెందిన ఓ పోలీసు బృందం ఆ కారు నంబర్ ఆధారంగా వెస్ట్ బెంగాల్‌కు వెళ్లినట్లు తెలిసింది. నగల దోపిడీ రాష్ట్రంలోనే సంచలనం రేపగా, నిందితులను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసు విభాగాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులతోపాటు వారికి సహకరించిన మరొకరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ దోపిడీకి వ్యూహరచన చేసిన ది గోల్డెన్ థీఫ్ అంతరాష్ట్ర గ్యాంగ్ లీడర్ సుభోద్‌సింగ్ సింగ్‌ను బిహార్ జైలు నుంచి కరీంనగర్‌కు తీసుకుచ్చేందుకు పోలీసులు కోర్టు వారెంట్‌తో ఐదు రోజుల కిందే అక్కడికి వెళ్లారు. మరో నాలుగు రోజుల్లో గ్యాంగ్ లీడర్‌ను కరీంనగర్‌కు తీసుకురానున్నట్టు తెలిసింది. దోపిడీ చేసేందుకు వచ్చిన ఐదుగురు నిందితులు గత ఏప్రిల్‌లోనే కరీంనగర్లో నగదు దుకాణాలపై రెక్కీ నిర్వహించి చివరికి పీఎంజేలో దోపీడీకి పథకం వేసినట్లు గుర్తించారు.
ఈ ముఠాకు నాయకత్వం వహించిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్‌ను ఈ నెల 1న ధర్మపురి నుంచి ఆదిలాబాద్ – చంద్రాపూర్ సరిహద్దు ప్రాంతమైన నార్నూర్ అటవీ ప్రాంతానికి వెళ్లి, సమీపంలోని దాబాలో భోజనం చేసి రాత్రి అక్కడే ఉండిపోయాడు. ముఖ్యనాయకుడైన సుభోద్‌సింగ్ సూచనలతో ఈ నెల 2న తెల్లవారుజామున కొంత మంది వెస్ట్‌బెంగాల్ నంబర్ ప్లేట్ ఉన్న కారులో వచ్చి రఘునాథ్‌కు తుపాకులు అందించారు. అతను వాటిని ఆటోలో కరీంనగర్ వైపు పంపించగా, అతడికి తెలియకుండాగానే తుపాకులు అందించిన వారు ఆ ఆటోను అనుసరించినట్టు తెలిసింది.
రఘునాథ్ తీసుకున్న తుపాకులు దోపిడీ కోసం తరలిస్తున్నాడా..? వాటిని మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నాడా..? అనే అనుమానంతో ఆటోను జన్నారం వరకు అనుసరించారు. ఆటోను ఫాలో అయిన కారు ఒకే మార్గం నుంచి వచ్చి వెళ్లినట్టు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడం పోలీసులకు కొంత ఊరట కలిగించింది. ప్రస్తుతం ఆ కారు ఎక్కడ ఉంది. ఏ ప్రాంతంలో ప్రయాణిస్తుంది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.