కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కరువవుతున్నది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు చెబుతున్నా.. అందులో అధికారులు ఉండడం లేదని అర్జీదారులు మండిపడుతున్నారు. అందుబాటులో ఉండి సందేహాలను తీర్చాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం కార్యాలయంవైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 20 : రాష్ట్ర ప్రభుత్వ వన్‌టైం సెటిల్మెంట్ కింద స్థలాలు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు 25 శాతం రాయితీ అవకాశం ఇచ్చింది. గత నెల 31తో ఈ గడువు ముగియగా, మరోసారి ఈ నెలాఖరు వరకు పొడిగించింది. అయితే, ఎల్ఆర్ఎస్లో అనేక సాంకేతిక సమస్యలు వస్తుండడంతో దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కనీసం సమాచారం కూడా ఇచ్చే వారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిజానికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించే విషయంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు (ఎల్-1) అధికారులు స్థలం ప్లాట్ దగ్గరకు వెళ్లి యాప్‌లో ఆ వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఫీజు కట్టిన తర్వాత ఎల్-1 అధికారి అప్లోడ్ చేస్తే టీపీవో (ఎల్-2) అధికారి దానిని పరిశీలించి అప్లోడ్ చేయాలి. తర్వాత కమిషనర్ (ఎల్-3) లాగిన్‌కు వెళ్తుంది. వారు ఓకే చేస్తే ప్రొసీడింగ్స్ వస్తాయి. కానీ, పలు దరఖాస్తుదారులకు ఎల్-1 అధికారి పరిశీలించిన తర్వాత దరఖాస్తుదారుడు ఫీజు కడితే ఎల్-2లో ఆమోదించిన తర్వాత ఎల్-3 లాగిన్‌కు వెళ్లకుండా మళ్లీ ఎల్-1కే వెళ్తుండడంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు. మరికొందరికి పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని రావడం.. అవి చేసినా మళ్లీ ఎల్-1, ఎల్-2 మధ్యలోనే ఆన్లైన్లో చూపించడంతో ఏమిచేయాలో అర్థంకాక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ సమస్యలపై కార్యాలయంలోనూ సరైన సమాధానం ఇచ్చే వారు లేకుండా పోయారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో ఎల్-1 అధికారులు స్థలం, ప్లాట్ దగ్గరకు వెళ్లి యాప్‌లో ఆ స్థలానికి సంబంధించిన వివరాలతోపాటు దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉండగా ఈ విషయంలో జాప్యం జరుగుతున్నది. కాగా, కొందరు అధికారులు ఈ పనులు వే గంగా చేపట్టేందుకు తమ వద్ద ఉన్న చైన్మెన్లను వినియోగిస్తున్నారు. అయితే, ఈ అప్లోడ్ విషయంలో ఈ చైన్మెన్లు ముడుపుల దందాకు తెర లేపారన్న ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో స్థల పరిశీలనకు రావాలని కార్యాలయం చుట్టూ తిరిగితే, ఎంతో కొంత ముట్టజెప్పితేనే చైన్మెన్లు వస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఫైల్‌కు రూ.వెయ్యి నుంచి 3 వే ల వరకు ముడుపులు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థలో 24,019 దరఖాస్తులు రా గా, ఇప్పటికే 5867మంది ఫీజులు చెల్లించారు. అందులో 16 54 మందికి ప్రొసీడింగ్‌లు జారీ కాగా, ఇతర మున్సిపాలిటీల్లో 8,315 దరఖాస్తులకు 1850 మంది ఫీజు చెల్లించారు. 784 ప్రొసీడింగ్‌లు జారీ చేయగా, సుడాలో 9873 రాగా 1869 మంది ఫీజలు చెల్లించారు. 473 ప్రొసీడింగ్‌లు ఇచ్చారు.
సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం వచ్చే దరఖాస్తుదారులకు సరైన సమాధానం దొరకడం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ విభాగంలో ఏ అధికారి కూడా సాయంత్రం వరకు కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశామని చెబుతున్న ఉన్నతాధికారులు వాటిలో ఓ అధికారి, సిబ్బంది కూడా కనీసం కనిపించడం లేదు. దీంతో కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్లడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సిబ్బందిని తమ సందేహాలపై అడిగితే సరైన సమాధానం ఇవ్వకుండానే తిప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు.