“పోరాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టి రాష్ర్టాన్ని ఆగం చేయొద్దు.. ఒక్క ఓటుతో తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ ఆంధ్రోళ్లు చెప్పినట్టే వింటయ్.. జాగ్రత్తగా ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్కే మళ్లీ పట్టంగట్టండి.. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం. ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తా” అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ మండలంలోని చామనపల్లి, బహ్దూర్ఖాన్పేట, సాయంత్రం నగరంలోని 41, 43 డివిజన్లలో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, మహిళలు మంగళహారతులు పట్టి, బొట్టు పెట్టి ఘన స్వాగతం పలుకగా, వారినుద్దేశించి మంత్రి ఆయా చోట్ల ప్రసంగించారు.
– కార్పొరేషన్/ కరీంనగర్‌రూరల్, నవంబర్ 16
కరీంనగర్ రూరల్, నవంబర్ 16 : సమైక్య పాలనలో అనేక కష్టాలు అనుభవించామని, ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టవద్దని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం కరీంనగర్ మండలంలోని చామనపల్లి, బహ్దూర్ఖాన్పేట గ్రామాల్లో ప్రచారం చేయగా గ్రామస్తులు, మహిళలు మంగళహారతులు పట్టి, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆయా చోట్ల మాట్లాడుతూ పచ్చని తెలంగాణను దోచుకునేందుకు ఆంధ్రోళ్లు కడుపునిండా విషం పెట్టుకుని వచ్చారని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో అనుభవించిన కష్టాలతో నల్లబడ్డ తెలంగాణ ప్రజల ముఖాలు… స్వరాష్ట పాలనలో తెల్లబడ్డాయని చెప్పారు.
2009 ఎన్నికలప్పుడు చామనపల్లి గ్రామం చొప్పదండి నియోజక వర్గం నుండి కరీంనగర్లో కలిసిందని, నాడు గ్రామంలో రోడ్లు, తాగునీరు లేవని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో రైతులు పొలం వద్ద పడిగాపులు కాసి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులను గుర్తు చేశారు. పదేళ్ల స్వయం పాలనలో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి పల్లెలను అభివృద్ధి చేశామన్నారు. కాళేశ్వరం జలాలతో పల్లెలు సస్యశ్యామలం అయ్యాయన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టాలని బీజేపీ ముసుగులో కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన ముసుగులో పవన్‌కల్యాణ్, కాంగ్రెస్ ముసుగులో కేవీపీ, షర్మిల హైదరాబాద్‌లో అడ్డా వేశారని, కేసీఆర్‌ను ఓడించి తెలంగాణను దోచుకెళ్లాలని చూస్తున్నారని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
ఒక్క ఓటు తప్పు జరిగితే మన పిల్లల భవిష్యత్ ఆంధకారమవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రోళ్లు చెప్పినట్టు వింటాయని, వాటికి అధికారం కట్టబెడితే మరోసారి దోచుకుని గుడ్డిదీపం చేస్తారని, తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టి ఆగం చేయొద్దని కోరారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ అభ్యర్థిగా భూ కబ్జాదారుడు వస్తున్నాడని, ఆయనపై 30కి పైగా కేసులున్నాయని, ఒక రౌడీషీటర్ అని, ఆయనకు ఓటేసి గెలిపిస్తే మన భూములను కబ్జా చేస్తాడని చెప్పారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తరువాత ఎప్పుడైనా కనిపించాడా? ప్రజల కష్టాలు పట్టించుకున్నాడా? అని ప్రశ్నించారు. ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి కోసం రూపాయి కూడా తేలేదని, తాను మాత్రం మీ బిడ్డగా మీ మధ్యనే ఉన్నానని, గుర్తు చేశారు. విలువైన ఓటును వృథా చేయకుండా మచ్చలేని మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరారు.
చామనపల్లి గ్రామ నుంచి ఇరుకుల్లకు, బహ్దూర్ఖాన్పేటకు, ఫకీర్పేటకు, ఎలబోతారానికి, జూబ్లీనగర్‌కు, చాకుంటకు, చెర్లభూత్కూర్‌కు కోట్ల రూపాయలతో రోడ్లు వేశామని, ఎస్సారెస్పీ కాలువ నుంచి ప్రత్యేక ఫీడర్ ఛానల్ ద్వారా కెనాల్ ఏర్పాటు చేసి, గ్రామంలోని రాజసముద్రం చెరువకు నీటిని తీసుకువచ్చామని మంత్రి గంగుల తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు అందంగా కనిపిస్తున్నాయని వివరించారు. తనను మరోసారి గెలిపిస్తే, మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
మంచోళ్లు ఎవరు?, దొంగ ఎవరు? అనే విషయాలపై చర్చ జరగాలని, అభివృద్ధికి ఓటేసి, సీఎం కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, శ్యాంసుందర్, సర్పంచ్‌లు బొగొండ లక్ష్మి, ఐలయ్య, తప్పట్లు భూమయ్య, దాది సుధాకర్, రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్, బల్ల అంజనేయులు, జగల్రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజిరెడ్డి, ఎల్లాగౌడ్, నర్సింగ్, పబ్బతి రంగారెడ్డి, గర్వంధ శ్రీనివాస్ పాల్గొన్నారు.