Ponguleti Srinivas Reddy | కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంప్లాయీస్ జేఏసీ మండిపడింది. మా ఐఏఎస్‌లను అలాగే అధికారులను, ఉద్యోగులను ఎవరైనా పరుష పదజాలంతో మాట్లాడినా లేదా అవమాన పరిచిన వారికి తగిన బుద్ధి చెబుతామని జేఏసీ హెచ్చరించింది. ఇటీవల కలెక్టర్ పమేలా సత్పతి విషయంలో మంత్రి పొంగులేటి మాట్లాడిన తీరును నిరసిస్తూ.. కరీంనగర్ జిల్లా ఉద్యోగ సంఘాలు కరీంనగర్‌లోని టీఎన్జీవో భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తీరుపై ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మీ స్వార్థ రాజకీయ క్రీడలకు ప్రభుత్వ ఉద్యోగులను బలి చేయొద్దని దారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఎక్కడ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్యకవాదులు, మేధావులు, ప్రొఫెసర్లు గుమిగూడిన.. అయ్యో మా జిల్లా కలెక్టర్ చేసిన తప్పేంటి ..? అని గుసగుసలాడుతూ రోదిస్తున్నారని తెలిపారు. ఇంత జరిగినా ఉద్యోగ సంఘ నాయకులుగా మీరు ఏం చేస్తున్నారంటూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై అనాలోచితంగా సహనాన్ని కోల్పోయి బాధ్యతగల పదవిలో ఉన్నవారు అలా మాట్లాడడం సరికాదని అన్నారు. ఆయన మాటలు కరీంనగర్ జిల్లా ఉద్యోగులందరినీ బాధించిందని, ప్రతి ఉద్యోగి కన్నీరు పెడుతున్నారని తెలిపారు.రాష్ట్రంలో ఐఏఎస్‌లను, అధికారులను, ఉద్యోగులను ఎవరైనా పరుష పదజాలంతో మాట్లాడినా.. అవమాన పరిచిన వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉద్యోగులపై సహనాన్ని కోల్పోయి పరుష పదజాలంతో విరుచుకుపడటం పదవిలోఉన్న వారికి తగదని అన్నారు.
ఒక జిల్లా కలెక్టర్‌పైనే ఈ విధంగా మాట్లాడితే.. ఇక మా సామాన్య ఉద్యోగులకు భద్రత ఎక్కడ ఉంటుందన్న భయంతో ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ మనస్సు చివుక్కుమనే విధంగా కళ్లలో కన్నీరు పెట్టించిన ఎవరికైనా, మా ఉద్యోగుల శాపం తగులుతుందని పేర్కొన్నారు. మా సహనాన్ని పరీక్షించవద్దని.. మేం తలుచుకుంటే ప్రజలతో మమేకమై ఏ ప్రజాప్రతినిధి ఏమి చేస్తున్నాడో సవివరంగా ప్రజలకు వివరించే సత్తా మా ఉద్యోగులకు మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ పై మాట్లాడిన మాటలు విత్ డ్రా చేసుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో మా మద్దతు మీకు ఉండదంటూ మంత్రిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు.
ప్రజాసేవే పరమావధిగా భావించి రాత్రింబవళ్లు కష్టపడుతున్న మా ఉద్యోగులపై పదిమందిలో అవమానపరిచే విధంగా మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగులుగా, సంఘ నాయకులుగా తగిన బుద్ధి చెప్పే రోజులను తీసుకు వస్తామని శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నో సందర్భాలలో చరిత్ర తిరగరాసిన రోజులు ఉన్నాయని, ఎప్పుడు ఎక్కడ వాత పెట్టాలో ప్రభుత్వ ఉద్యోగులకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలవదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులుగా మేము ప్రజలకు జీతగాళ్లమని, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని.. మీ రాజకీయ క్రీడ కోసం మా ఉద్యోగులను బలి చేయొద్దని కోరారు. మీ రాజకీయాల్లో ఉద్యోగులను లాగొద్దని సూచించారు.