మంథని టౌన్, మే 16: ‘కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని రెచ్చిపోతున్నారు. అసత్య ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని కోల్పోయేలా వ్యవహరిస్తున్నారు… వారి కుట్రలు ఎండగట్టాలి. నిజానిజాలపై చర్చ జరగాలి. వాస్తవాలను ప్రజల ముందుంచి నిగ్గు నిగ్గుతేల్చాలి’ అంటూ ఎంపీ వెంకటేశ్ నేతకాని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్‌లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ జన్మదినం, స్వేచ్ఛా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంథని నియోజకవర్గంలో ప్రజా సేవే పరమావధిగా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్-శైలజ దంపతులు నిరంతరం సేవ చేస్తున్నారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎమ్మెల్యేగా మధూకర్ ఎంతో సహకరించారని గుర్తు చేశారు. తన రాజకీయ వారసులు ప్రజల నుంచే రావాలనే కోరుకుంటున్న గొప్ప వ్యక్తి పుట్ట మధూకర్ అని కొనియాడారు. గొప్పగా పని చేసే మంచి రాజకీయ నాయకులను ప్రజలు కోల్పోవద్దని, కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కష్టపడి పనిచేసి మంథని నియోజకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేద్దామని, కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు.
సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం: కోరుకంటి
మంథని నియోజకవర్గంలో వాస్తవాలు దాచి అసత్య ప్రచారం చేస్తున్నారని, దానిపై గులాబీ సోషల్ మీడియా సేన కత్తి గట్టుకొని పని చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం వచ్చిన తర్వాత.. రాకముందు ఇక్కడ ఉన్న పరిస్థితులపై చర్చ జరగాలని సూచించారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నుంచి పుట్ట మధూకరే అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు.
35ఏండ్ల పాలన వాళ్లది.. నాలుగేండ్ల పాలన నాది: పుట్ట మధూకర్
మంథని నియోజకవర్గాన్ని అయ్యా, కొడుకులు 35 ఏండ్లు ఏలి దోచుకుతిన్నారని, ఆ డబ్బంతా దేశ, విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టి వ్యాపారం చేస్తున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై జడ్పీ చైర్మన్ మధూకర్ విమర్శనాస్ర్తాలు సంధించారు. తాను మంథని నుంచి ఒక పేద బిడ్డగా ఎన్నికై తనకు దొరికిన నాలుగేండ్ల మూడు నెలల్లో ఎనలేని అభివృద్ధిని చేశానని గుర్తు చేశారు. శ్రీపాదరావు, శ్రీధర్‌బాబు తమ 35 ఏండ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క బ్రిడ్జి కూడా కట్టలేదని, తాము పదుల సంఖ్యలో బ్రిడ్జిలు, రోడ్లను నిర్మించామని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యే అయితే ట్రస్టును ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేశానని, తాను చేసిన పనులన్నీ ఇప్పుడు ఎం దుకు చేయడం లేదని ప్రస్తుత ఎమ్మెల్యేను ప్రజలు నిలదీయాలని కోరారు. మంథని నియోజకవర్గంలో శ్రీధర్‌బాబుకు తన తండ్రి తప్పా ఒక్క మహనీయుడు కూడా కనిపించలేదని, శ్రీపాద కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన పీవీ విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టలేదని దుయ్యబట్టారు.
అభివృద్ధిపై చర్చించాలి: భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి
రాజకీయాలకు అతీతంగా, నియోజకవర్గ వ్యాప్తంగా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిపై ప్రజల్లో చర్చించాలని భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి కార్యకర్తలకు సూచించారు. 35 ఏళ్ల పాలనకు నాలుగేళ్ల పాలనపై ప్రధాన చర్చ జరగాలని, 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతో పుట్ట మధూకర్‌ను గెలిపించుకోవడమే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న ఎంపీ వెంకటేశ్‌నేత పాట..
‘కొమురంభీముడో.. కొమురంభీముడో.. కొర్రాసు నెగడోలే.. మండాలి కొడుకో.. మండాలి కొడుకో’ అంటూ.. ‘ఎవ్వడంటా.. ఎవ్వడంటా.. నిన్ను ఎత్తుకుంది.. ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది’.. అంటూ ఎంపీ వెంకటేశ్ నేతకాని పుట్ట మధూకర్‌ను ఉద్దేశించి వేదికపై పాటలు పాడడం ఆకట్టుకున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉర్రుతలూగించింది. తాను పెద్దపల్లి నుంచి వచ్చే దారిలో కమాన్‌పూర్ వద్ద ఫ్లెక్సీపై మంథని కొమురంభీం పుట్ట మధూకర్ అని, సెంటినరీకాలనీలో వద్ద ఫ్లెక్సీపై బాహుబలి చిత్రాలను చూశానని పేర్కొంటూ ఈ రెండు పాటలను పాడారు. కాగా, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్ పర్సన్ శ్రీరాంభట్ల సంతోషిణి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు ఎగోలపు శంకర్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కనవేన శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు కొండ రవీందర్, నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.