చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ప్రతిభావంతులకు అభినందన
గంగాధర, జూన్ 29: విద్యారంగానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గంగాధర మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపారు. కాగా, బూరుగుపల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, క్రమశిక్షణ, పట్టుదలతో చదివి భవిష్యత్‌లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం
చొప్పదండి, జూన్ 29: మండలంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి లయన్స్‌క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించి, మాట్లాడారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు నలుమాచు సుధాకర్, కార్యదర్శి గొల్లపల్లి నరేశ్, కార్యదర్శి రాజేశ్పవార్, జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ ఆనందం, కో-ఆర్డినేటర్ లక్ష్మీకాంతం, సభ్యుడు మల్లేశం పాల్గొన్నారు.