మ్మికుంట, జూన్ 22: నైపుణ్యంతో కూడిన శిక్షణ ఉపాధికి మార్గం చూపుతుందని, స్పందన సేవా సొసైటీ ఆధ్వర్యంలో మగ్గం వర్క్‌లో శిక్షణ పొందిన మహిళలు ఆర్థికోన్నతి సాధించడం అభినందనీయమని నాబార్డు ఏజీఎం అనంత్ కొనియాడారు. నాబార్డు సహకారంతో స్పందన సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శోభారాణి ఆధ్వర్యంలో మార్చి నెలలో బస్టాండ్ సమీపంలో 90మంది మహిళలకు మగ్గం వర్క్స్‌లో 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందిన 30 మంది మహిళలు ప్రత్యేక షాపులను నిర్వహిస్తూ మగ్గం వర్క్స్‌లో రాణిస్తున్నారు.
ఒక్కో మహిళ దాదాపు రూ.10వేల నుంచి 15వేలు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో శిక్షణ పొంది సక్సెస్ బాటలో పయనిస్తున్న మహిళలను అభినందించారు. బుధవారం నాబార్డు ఏజీఎం, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మగ్గం వర్క్స్ పనులను పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి, మగ్గం వర్క్స్‌లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏజీఎం మాట్లాడారు. మగ్గం వర్క్స్‌లో శిక్షణ పొందిన మహిళలల్లో పట్టుదల పెరిగి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధిలో రాణించే ప్రతి మహిళకు నాబార్డు నుంచి సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.
ఇదే స్ఫూర్తితో మహిళలు శిక్షణ పొంది, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. 15 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా సంపాదించడం సంతోషానిచ్చిందని, నాబార్డు సహకారంతో మరిన్ని శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతానని స్పందన సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శోభారాణి పేర్కొన్నారు. ఇక్కడ కేవీకే శాస్త్రవేత్త ప్రశాంతి, వాణి, మగ్గం వర్క్‌లో రాణిస్తున్న మహిళలు పాల్గొన్నారు.