సైదాపూర్, నవంబర్ 18: మండలంలోని ఆకునూర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉపాధ్యాయులుగా మారి సహచరులకు పాఠ్యాంశాలను బోధించారు. ప్రతిభ చూపిన వారికి ఎస్వో బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రజిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘విద్యోదయ’లో..
పట్టణంలోని విద్యోదయ విద్యాసంస్థల్లో గురువారం సంస్థ చైర్మన్ యేబూషి రామస్వామి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు విద్యాసంస్థలు పాటుపడాలని సూచించారు. బాలల దినోత్సవం లాంటి కార్యక్రమాలు పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని విద్యోదయ విద్యా సంస్థల చైర్మన్ యేబూషి రామస్వామి తెలిపారు. తర్వాత విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు తోటి విద్యార్థులను ఆకట్టుకున్నాయి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ యేబూషి జ్యోతి, డైరెక్టర్ ఆర్యన్కౌశిక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి వారికి పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.