ఇప్పటి వరకు 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం.. ప్రస్తుతం 80 వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నాం. మూడు నాలుగు నెలలు సెల్ఫోన్లు పక్కన పెట్టండి. కసితో చదవండి. సమాజంలో సెల్‌ఫోన్ వాడకం వ్యసనంలా మారింది. అటువంటి వ్యసనానికి లొంగవద్దు. కేవలం పోటీ పరీక్షలకు అవసరమయ్యే విజ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవండి. పోటీ పరీక్షల్లో 1:12 కాంపిటీషన్ ఉన్నది. ఒకవేళ ఉద్యోగం రాకుంటే నిరాశ చెందవద్దు. జీవితం చాలా పెద్దది. అపజయం ఎదురైనంత మాత్రాన కుంగిపోవద్దు. సొంత కాళ్లపై నిలబడేలా చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఇతరులకు ఉపాధి చూపించే స్థాయికి ఎదగవచ్చు.
-ముస్తాబాద్‌లో ఉద్యోగార్థులనుద్దేశించి మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/ముస్తాబాద్, జూన్ 15 : ఉద్యోగ సాధనే లక్ష్యంగా యువత కసితో చదివి కొలువు సాధించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. ముస్తాబాద్‌లో ఎంపీపీ జనగామ శరత్‌రావు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఉచిత కోచింగ్ కేంద్రంలో ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ అందించి, వారినుద్దేశించి మాట్లాడారు. దేశంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దిక్సూచిగా ఉండగా, యువతకు ఉపాధి కల్పించడంలోనూ ఆదర్శవంతంగా ఉందని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో యువత సెల్‌ఫోన్ పక్కన పెట్టాలని సూచించారు. అలాగే, కాలానుగుణంగా నైపుణ్యం మెరుగుపరుచుంటేనే సమాజంలో అభివృద్ధి చెందుతూ అంచలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంటుందని వివరించారు. నిధులు నియామకాలు, నీళ్లు ఎజెండాగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రస్తుతం మరో 80 వేల ఉద్యోగాలకు నోటిపికేషన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు.
పోటీ పరీక్షల్లో 1:12 కాంపిటీషన్ ఉందని, ఉద్యోగం రాకుంటే నిరాశ చెందవద్దని కోరారు. జీవితం చాలా పెద్దదని, అపజయం ఎదురైనంత మాత్రాన కుంగి పోవద్దని మనోధైర్యం కల్పించారు. సొంత కాళ్లపై నిలబడేలా చిన్న చిన్న పరిశ్రమలు, సూక్ష్మ తరహా పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతను అందిస్తున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, స్వయం ఉపాధి పథకాలకు పెద్ద పీట వేసిందని వివరించారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా రుణాలను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఎనిమిదేళ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 19 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చి దాదాపు 16 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించిందని వివరించారు. నీళ్లు, నియామకాలు, నిధుల ఎజెండాను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని వివరించారు.
ప్రపంచంతో అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది? అని గుగూల్లో సెర్చ్ చేయాలని మంత్రి కేటీఆర్ కోరగా, యువత అంతా సెర్చ్ చేసి కాళేశ్వరం అని ముక్తకంఠంతో చెప్పారు. ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వర జలాలు పుణ్యమా అని మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్‌లో నట్టనడి ఎండకాలంలో చెరువులు నిండుకుండలా ఉన్నాయని, మార్చి నెలలో సైతం ఎగువమానేరు మత్తడి దూకిందని గుర్తుచేశారు. భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెరిగాయని, యువ శిక్షణ కలెక్టర్లకు కాళేశ్వర జలాలు పాఠాలు అయ్యాయని తెలిపారు. నిధుల విషయంలో దేశంతో పోల్చితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. భౌగోళికంగా 11వ, జనాభాలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ దేశానికి అన్నం పెట్టే విషయంలో 4వ స్థానంలో ఉందని వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో రూ.1.24 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.2.78 లక్షలకు పెరిగిందని, దేశ ప్రస్తుతం తలసరి ఆదాయం కేవలం రూ.1.49 లక్షలు మాత్రమే ఉందని వివరించారు. తెలంగాణ స్థూల ఉత్పత్తి ఆదాయం(జీఎస్డీపీ) 2014లో ఐదు లక్షలు ఉండగా ప్రస్తుతం 11 లక్షలకు పెరిగిందన్నారు. అభివృద్ధికి ప్రామాణికాలైన తలసరి ఆదాయం, జీఎస్డీపీలో మన రాష్ట్రం ముందంజలో ఉందని స్పష్టం చేశారు. మన నిధులను మనమే ఖర్చు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాంత యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, వారికి ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్న ఎంపీపీ జనగామ శరత్‌రావును మంత్రి అభినందించారు.
నా లేఖకు మోదీ స్పందించారు
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని తాను వారం క్రితం లేఖ రాస్తే ప్రధాని స్పందించారని చెప్పారు. 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినట్టు మంత్రి తెలిపారు.
చీకోడులో సీసీ కెమెరాలు ప్రారంభం
చీకోడులో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను, జడ్పీ ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు ప్రొజెక్టర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కాగా, సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు ఆశోక్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాధారపు సత్యం రూ.5 లక్షలు అందించగా, వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చీకోడు జడ్పీ పాఠశాలలో చదువుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్శరాంనగర్ నుంచి కాలినడకన వస్తున్న 25 మంది విద్యార్థులకు సైకిళ్లు ఇప్పించాలని మంత్రి కేటీఆర్‌ను వేడుకోగా, వెంటనే ఆయన స్పందించి, అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలను ఏడో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయాలని పలువురు మహిళలు మంత్రి కేటీఆర్‌ను కోరగా తప్పకుండా మంజూరు చేస్తానని తెలిపారు.
మళ్లొచ్చేది మన ప్రభుత్వమే..
“మళ్లొచ్చేది మన ప్రభుత్వమే.. మీ అందరి దయ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారు” అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చీకోడులో యాదవ సంఘానికి చెందిన వంద మంది, వివిధ పార్టీలకు చెందిన 20 మంది టీఆర్ఎస్లో చేరగా, వారికి పార్టీ కండు వా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ వచ్చిందని, నర్సరీ, పల్లె ప్రకృతివనం, డంప్ యార్డ్, వైకుంఠధామం, ఇంటింటికీ నల్లా వంటి వసతులతో గ్రామాలు పరిఢవిల్లుతున్నాయని తెలిపారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ తండ్రి పాత్ర పోషిస్తున్నారని, మనమంతా ఐకమత్యంగా ఊరును బాగు చేసుకుందామని, అభివృద్ధి చేసే వారినే ప్రజలు ఆశీర్వదిస్తారని, వారికే పదవి దక్కుతుందని చెప్పారు. గ్రామాల అభివృద్ధి ఒకవైపు, ఐటీ రంగం అభివృద్ధి మరోవైపు తెలంగాణ జోడెడ్ల బండిలా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు.
గూడెంలో వాణిజ్య భవన సముదాయం ప్రారంభం
పోతుగల్ సహకార సంఘం అధ్వర్యంలో గూడెంలో రూ.25 లక్షలతో నిర్మించిన వాణిజ్య భవన సముదాయాన్ని మంత్రి కేటీఆర్ సంఘం అధ్యక్షుడు బాపురావుతో కలిసి ప్రారంభించారు. కొండాపూర్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త యారేటి నర్సింలు ఇటీవల మృతి చెందగా, పార్టీ ప్రమాద బీమా ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును మృతుడి భార్య పావనికి అందించారు. చిప్పలపల్లికి చెందిన మహిళా రైతు గాడిచర్ల మల్లవ్వ మృతి చెందగా, అమె కొడుకు శ్రీనివాస్‌కు రూ.5 లక్షల చెక్కును పంపిణీ చేశారు. సేవలాల్ తండాలో కొత్తగా నిర్మించిన జగదాంబ- సేవలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ట ఉత్సవంలో మంత్రి పాల్గొనగా, గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులతో మంత్రికి స్వాగతం పలికారు.
రామాలయ ప్రతిష్ఠాపనోత్సవాల్లో రామన్న
పోతుగల్లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం నుంచి ప్రారంభమైన పునః ప్రతిష్ఠాపనోత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొనగా, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుం భం, వేద మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి గురించి ఆయనకు కమిటీ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు రంగారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, తదితరులు పాల్గొన్నారు.
రామన్న భరోసా
మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దంపతులకు అండగా నిలిచారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స చేయించి భరోసానిచ్చారు. వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన చెలకపల్లి పరశురాములు-నర్సవ్వ పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నిరుపేదలైన వీరి దయనీయస్థితిని జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు , స్థానిక సర్పంచ్ పిట్ల నాగరాజు మంత్రికేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ వెంటే అమాత్యుడి సూచనల మేరకు క్షతగాత్రులను నిమ్స్ కు తరలించారు. మంత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దవాఖాన నుంచి ఇంటికి చేరిన దంపతులను బుధవారం జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తదుపరి చికిత్స కోసం అవసరమైతే ఎల్వోసీ అందిస్తామని మంత్రి చెప్పారని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా అమాత్యుడికి కృతజ్ఞతలుతెలిపారు.