కార్పొరేషన్, జూన్ 15: నగర ప్రజలు మెచ్చేలా కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, నగరంపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగరంలో డ్యాం సమీపంలో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ పనులను బుధవారం పరిశీలించారు. అనంతరం తెలంగాణ చౌక్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సంబంధించి సీసీ కెమెరాల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే ప్రధాన రోడ్లతోపాటు, డివిజన్లల్లోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రత్యేకంగా రూ. 98 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈక్రమంలో 335 అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటితో పాటు నగరంలో ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు 85 ట్రాఫిక్ సిగ్నిల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇవి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓ విధమైన టైమింగ్, ట్రాఫిక్ లేనప్పుడు సులువుగా వెళ్లేలా ఆటోమెటిక్ టైమింగ్ చేంజ్ అవుతుందని తెలిపారు. సిగ్నిల్స్ వద్ద నిబంధనలను అతిక్రమించే వారి వాహనాల నంబర్లను రికగ్నైజ్ చేసేందుకు వీలుగా 174 కెమెరాలు ఏర్పాటు చేస్తునార్నమన్నారు. నగరంలో తిరిగే వివిధ వాహనాలను గుర్తించే ఇతర కెమెరాలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా నగరంలో వాతావరణ పరిస్థితులను తెలిపే వీలుగా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తామని, ప్రజలందరికి ఒకేసారి అత్యవసర సమాచారం అందించేందుకు వీలుగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. 150 ప్రాంతాల్లో వైఫై హాట్స్ఫాట్స్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
నగరపాలక సంస్థకు చెందిన చెత్తను తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుతోపాటు వాటి పనితీరును కూడా పరిశీలిస్తామన్నారు. నగరంలో ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్స్‌ను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్యాం సమీపంలో రెండు కిలోమీటర్ల మేరకు ప్రత్యేకంగా అడవి మధ్యలో ఉన్నామన్న అన్న అనుభూతి కలిగేలా ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీంతో పాటుగా మరో ట్రాక్‌ను కూడా ఉజ్వల పార్కు నుంచి లేక్ అవుట్ పోస్టు వరకు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై.సునీల్‌రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్ వాల రమణారావు, తోట రాములు, నాంపెల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.