రామడుగు, జూన్ 15: పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జడ్పీ సీఈవో ప్రియాంక సూచించారు. రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను బుధవారం సాయంత్రం ఆమె పరిశీలించారు. సర్పంచ్ అభిషేక్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటి, నీళ్లు పోశారు. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, గ్రామీణ క్రీడా ప్రాంగణం, ఇతర పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ, గ్రామాలు పరిశుభ్రతకు నిలయంగా మారాలన్నారు. అంతర్గత రహదారులకు ఇరువైపులా, మురుగు కాల్వల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని ఆదేశించారు. నర్సరీని ఎస్సారెస్పీ స్థలంలోకి మార్చాలని సర్పంచ్‌ను సూచించారు. గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పల్లెప్రగతి మండల ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సురేందర్, ఏపీవో రాధ, పంచాయతీ కార్యదర్శి, ఉపాధిహామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.