రామడుగు, జూన్ 15: గ్రామాల్లో హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడాలని ఎంపీపీ కలిగేటి కవిత పిలుపునిచ్చారు. మండలంలోని రాంచంద్రాపూర్లో బుధవారం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి, నీళ్లు పోశారు. ఉపాధిహామీ పనులు, పల్లె ప్రకృతివనం, నర్సరీని పరిశీలించారు. గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు వరుసల మొక్కలు నాటించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు పట్టణాలను తలపించేలా అభివృద్ధి చెందాయన్నారు.
కాళేశ్వరం జలాలతో మండలం సస్యశ్యామలమైనట్లు పేర్కొన్నారు. అలాగే, వెలిచాలలో గ్రామీణ క్రీడా మైదానాన్ని సర్పంచ్ వీర్ల సరోజన సందర్శించారు. పనులు త్వరగా పూర్తి చేసిన అధికారులను అభినందించారు. గ్రామ శివారులోని సెగ్రిగేషన్ షెడ్డును సందర్శించి, తయారు చేస్తున్న కంపోస్ట్ ఎరువును పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, సర్పంచ్ వీర్ల సరోజన, ప్రత్యేకాధికారులు పీఆర్ ఏఈ సచిన్, సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు మధునయ్య, మౌనిక, టీఆర్ఎస్ నాయకుడు కలిగేటి లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జూన్ 15: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాదయాత్ర నిర్వహించారు. హరితహారం మొక్కలను పరిశీలించి, ఎండిపోయిన చోట కొత్తవి నాటాలని నిర్ణయించారు. మొక్కల చుట్టూ ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మురుగు కాల్వలను, వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లారు. దోమల నివారణ కోసం వీధుల్లో ఫాగింగ్ చేయాలని నిర్ణయించారు. ప్లాస్టిక్ నిషేధంపై గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో పాటు వినియోగించద్దని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.