శంకరపట్నం, జూన్ 15: ఆయిల్‌పాం సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుందని హార్టికల్చర్ అధికారి స్వాతి తెలిపారు. బుధవారం కాచాపూర్ క్లస్టర్ రైతు వేదికలో ఉద్యానవన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఆయిల్‌పాం సాగులో ఎకరాకు 49 మొక్కలు నాటుకోవచ్చని తెలిపారు. దిగుబడి 3 సంవత్సరాలకు మొదలై 30 సంవత్సరాల వరకు వస్తుందని వెల్లడించారు. ఎకరాకు 8-12 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం టన్ను ధర రూ. 23 వేలు పలుకుతున్నదన్నారు.
రైతు ఎకరాకు రూ. 25000-30000 వరకు ఖర్చు పెడితే, రూ. లక్ష పైన నికర ఆదాయం వస్తుందని వెల్లడించారు. కోతుల బెడద ఉండదని, 3 సంవత్సరాల వరకు అంతర పంటలు సైతం వేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆసక్తి గల రైతులు ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొక్కలను సబ్సిడీపై అందించడమే కాక 3 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు. మొక్కలు ఇచ్చిన ప్రతి రైతు నుంచి లోహియా కంపెనీ గెలలను కొనుగోలు చేస్తుందని తెలిపారు. సర్పంచ్ కోండ్ర రాజయ్య మాట్లాడుతూ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కనీసం రెండెకరాల్లో ఆయిల్ పాం సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లోహియా కంపెనీ జనరల్ మేనేజర్ పద్మనాభం, ఫీల్డ్ ఆఫీసర్ జకీయొద్దీన్, ఏవో శ్రీనివాస్, ఏఈవో రాజ్‌కుమార్, రైతుబంధు సమితి మండల సభ్యుడు రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.